తెలంగాణలో రూ.500 కోట్లు స్వాధీనం..!
అక్టోబర్ 9న షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుంచి నవంబర్ 7 నాటి వరకు మొత్తం రూ.518 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో 22 రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలు, సోదాల్లో భారీగా నగదు, మద్యం, ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి. ఇప్పటివరకూ పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేసిన సొత్తు రూ.500 కోట్లు పైమాటే.
మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రూ.518 కోట్ల విలువైన సొత్తును పోలీసులు, సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్ములో రూ.177 కోట్ల నగదు, 292 కిలోల బంగారం, 11 వందల 68 కిలోల వెండి ఉంది. దీంతో పాటు రూ.178 కోట్ల విలువైన మద్యం, రూ.66 కోట్ల విలువైన గంజాయి, మరో రూ.30 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసే వస్తువులు ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అక్టోబర్ 9న షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుంచి నవంబర్ 7 నాటి వరకు మొత్తం రూ.518 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్‌కు మరో 22 రోజుల టైమ్ ఉండటంతో ఇది దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.