Telugu Global
Telangana

రేపే ఎన్నికల నోటిఫికేషన్.. వెంటనే నామినేషన్ల ప్రక్రియ షురూ

శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో దాఖలు చేయవచ్చు.

రేపే ఎన్నికల నోటిఫికేషన్.. వెంటనే నామినేషన్ల ప్రక్రియ షురూ
X

తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టానికి రేపు తెరలేవనున్నది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం (నవంబర్ 3) విడుదల చేయనున్నది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నది. శుక్రవారం ఉదయం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతుంది.

శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో దాఖలు చేయవచ్చు. ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల 5న ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు నామినేషన్లు తీసుకునే అవకాశం లేదు. ఆ ఒక్క రోజు తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

ఏ రోజైనా నామినేషన్లు వేయడానికి ఎక్కువ మంది అభ్యర్థులు వస్తే వారికి స్లిప్‌లు అందజేస్తారు. వాటిని తీసుకొని మరుసటి రోజు నామినేషన్ వేయవచ్చు. కాగా నామినేషన్లు వేసే అభ్యర్థులు ముహూర్తాలు కూడా చూసుకునే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి 10 వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ మూడు రోజులు ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నామినేషన్ రోజు నుంచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఈసీఐ పరిగణలోకి తీసుకుంటుంది.

రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 10 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 13వ తేదీన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగనున్నది. ఈ నెల 15 వరకు నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది. అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాష్ట్రంలో ఎక్కడ ఓటు హక్కు ఉన్న అభ్యర్థికి అయినా అర్హత ఉంటుంది. అయితే సదరు అభ్యర్థిని బలపరిచే వ్యక్తులు మాత్రం స్థానిక ఓటర్లై ఉండాలి. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు అఫిడవిట్‌ను అసంపూర్తిగా నింపి ఇస్తే దానికి ఆర్వో నోటీసులు జారీ చేస్తారు. అభ్యర్థి దానిని సవరించాల్సిందిగా సూచిస్తారు. అప్పటికీ అభ్యర్థి స్పందించకుంటే నామినేషన్ తిరస్కరించే అధికారం ఆర్వోకు ఉంటుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే జనరల్, బీసీ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు ధరావతు కింద చెల్లించాల్సి ఉంటుందని ఈసీఐ పేర్కొన్నది.

First Published:  2 Nov 2023 7:01 AM IST
Next Story