తెలంగాణ ఎన్నికలు.. జనసేనకు షాకిచ్చిన ఈసీ
ప్రస్తుతం తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటించింది. అయితే ఆ ఎనిమిది మందిని ఎన్నికల సంఘం ఇండిపెండెంట్లుగానే గుర్తించనుంది.
రోజుల వ్యవధిలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న వేళ జనసేన పార్టీకి ఎన్నికల సంఘం పెద్ద షాక్ ఇచ్చింది. జనసేన సింబల్‌గా చెప్పుకునే గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్‌గానే ఎన్నికల సంఘం గుర్తించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతున్నా.. చాలా ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయలేదు. ఏపీలో గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించినప్పటికీ.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలకు జనసేన దూరం ఉండటంతో గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలోకి చేర్చింది.
కొన్ని నెలల తర్వాత ఈసీ మళ్లీ గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించింది. ఏపీలోనే జనసేనకు ఈ విధమైన పరిస్థితి ఉంటే.. తెలంగాణలో ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణలో జరిగిన చాలా ఎన్నికలకు జనసేన దూరం ఉండటంతో ఆ పార్టీ గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీగా ఈసీ గుర్తించలేదు. అందుకే ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును రిజర్వు చేయలేదు.
ప్రస్తుతం తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటించింది. అయితే ఆ ఎనిమిది మందిని ఎన్నికల సంఘం ఇండిపెండెంట్లుగానే గుర్తించనుంది. జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు గ్లాస్ గుర్తు కాకుండా ఆయా నియోజకవర్గాల్లో ఈసీ కేటాయించే సింబల్‌ను ప్రమోట్ చేస్తూ ఓటు అభ్యర్థించాల్సి ఉంటుంది. గ్లాస్ గుర్తు ఇప్పటికే జనసేన సింబల్ గా ప్రజల్లో గుర్తింపు పొందింది. అయినప్పటికీ ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఇతర గుర్తులతో పోటీ చేయాల్సి ఉండటంతో జనసేనకు ఇది తీవ్రనష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.