Telugu Global
Telangana

తెలంగాణలో ఈసీ అధికారులు.. ఎన్నికలు ఎప్పుడంటే..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: జూన్‌-1 నుంచి ఈవీఎంల మొదటి దశ పరిశీలన చేపడతారు అధికారులు. జిల్లా ఎన్నికల అధికారులకు రెండు రోజులపాటు వర్క్ షాప్ నిర్వహించేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు.

తెలంగాణలో ఈసీ అధికారులు.. ఎన్నికలు ఎప్పుడంటే..?
X

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ గడువు పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిలోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ గురించి ముందస్తుగా సమాచారమేదీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి అధికారులు తెలంగాణలో పర్యటనకు వచ్చారు.

హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌.. ఇక్కడి చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్‌ వికాస్‌ రాజ్‌, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై రాష్ట్ర అధికారులతో చర్చించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి మాట్లాడారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఉంటే సరిదిద్దాలని సూచించారు. రిటర్నింగ్‌ అధికారుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు.

జూన్‌-1 నుంచి..

జూన్‌-1 నుంచి ఈవీఎంల మొదటి దశ పరిశీలన చేపడతారు అధికారులు. జిల్లా ఎన్నికల అధికారులకు రెండు రోజులపాటు వర్క్ షాప్ నిర్వహించేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు. పోలింగ్‌ శాతం పెరిగేలా కార్యక్రమాలు చేపట్టాలని ఈసీ బృందం ఇక్కడి అధికారులకు సూచించింది.

ఎన్నికలు ఎప్పుడంటే..?

2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ లెక్కన తెలంగాణ అసెంబ్లీకి 2019లో సార్వత్రిక ఎన్నికలతోపాటు పోలింగ్ జరగాల్సి ఉన్నా.. సీఎం కేసీఆర్ ముందస్తుకి వెళ్లడంతో 2018 డిసెంబరు 7న అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాదితో అసెంబ్లీ గడువు పూర్తవుతుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారనేది ఈసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

First Published:  15 April 2023 9:43 PM IST
Next Story