Telugu Global
Telangana

ఎన్నికల్లో డబ్బు కట్టడిపై దృష్టి.. తెలంగాణలో సీఈసీ కీలక సమావేశాలు

పగడ్బందీగా నిఘా పెట్టి ఎన్నికల్లో ధన ప్రవాహం, బహుమతుల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని సూచించారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.

ఎన్నికల్లో డబ్బు కట్టడిపై దృష్టి.. తెలంగాణలో సీఈసీ కీలక సమావేశాలు
X

ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల పర్యటన కోసం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు వచ్చింది. మూడురోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో మంగళవారం సమావేశమయ్యారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ముఖ్యంగా ఎన్నికల్లో ధన ప్రవాహం, మద్యం పంపిణీ, ఉచిత బహుమతుల పంపిణీపై దృష్టిసారించాలని ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలకు సూచించారు.

డబ్బు కట్టడి ఇలా..

- ఎన్నికల సమయంలో బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో జరిగే నగదు ఉపసంహరణలపై నిఘా.

- పటిష్టంగా చెక్ పోస్ట్ ల ఏర్పాటు, వాహనాల తనిఖీ

- బహుమతులు దాచి ఉంచే గోడౌన్లపై నిఘా

- బహుమతులు అమ్మే షాపులు, హోల్ సేల్ డీలర్ల నుంచి సమాచార సేకరణ..

ఇలా పగడ్బందీగా నిఘా పెట్టి ఎన్నికల్లో ధన ప్రవాహం, బహుమతుల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని సూచించారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. తెలంగాణలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా పంచిన ఉదాహరణలున్నాయని, అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్మే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఈసారి నిఘా మరింత పెంచాలని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఎన్నికల సంఘం అధికారులు కోరారు.

ఆదాయపన్ను శాఖ, ఈడీ, డీఆర్‌ఐ, కస్టమ్స్‌, ఆర్బీఐ, సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఫైనాన్స్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం, జీఎస్టీ, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో, పోలీస్, ఆబ్కారీ, బ్యాంకర్ల కమిటీ, ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ బ్యూరో, తపాలా, రవాణా శాఖ తదితర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు తమ సన్నద్ధతను వివరించారు. ఈరోజు, రేపు కూడా తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల పర్యటన కొనసాగుతుంది.

First Published:  4 Oct 2023 7:20 AM IST
Next Story