Telugu Global
Telangana

కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి.. కానీ..!

జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఈలోగా చేయాల్సిన అత్యవసర పనుల గురించి మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించాలని చెప్పింది ఈసీ.

కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి.. కానీ..!
X

తెలంగాణ కేబినెట్ భేటీకి ఎట్టకేలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. ఆ షరతులకు లోబడే మీటింగ్ పెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించింది ఈసీ. శనివారం తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగాల్సి ఉన్నా.. ఈసీ అనుమతి లేకపోవడంతో అది వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి కోరగా ఈసీ సరేనంది. అయితే కండిషన్స్ అప్లై అని తేల్చి చెప్పింది.

అత్యవసర విషయాలపై మాత్రమే..

జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఈలోగా చేయాల్సిన అత్యవసర పనుల గురించి మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించాలని చెప్పింది ఈసీ. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని కూడా పేర్కొంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైలమాలో పడింది. ఈసీ అనుమతి ఇచ్చినా ఇప్పుడు కేబినెట్ భేటీ జరపాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు నేతలు.

వాస్తవానికి రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్‌ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై తెలంగాణ కేబినెట్ చర్చించాలనుకుంది. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతుండగా.. పునర్విభజన చట్టంలో ఇప్పటివరకు ఏపీ, తెలంగాణల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా ఈ భేటీలో చర్చించాలనుకున్నారు. తాజాగా ఈసీ కండిషన్లు పెట్టడంతో ఈ చర్చలు జరగవని తేలిపోయింది. కీలక విషయాలు చర్చించలేనప్పుడు ఇక కేబినెట్ భేటీ ఎందుకనే ప్రశ్న కూడా వినపడుతోంది. ఫలితాల తర్వాతే పూర్తి స్థాయి భేటీ పెట్టుకోవచ్చు కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  19 May 2024 6:46 PM IST
Next Story