రైతుబంధుకి బ్రేక్.. నిర్ణయం మార్చుకున్న ఈసీ
వాస్తవానికి ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ ఎదురైనట్టయింది.
తెలంగాణలో రైతుబంధు పంపిణీకి ఇటీవల అనుమతి ఇచ్చిన ఎన్నికల కమిషన్.. రోజుల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆ అనుమతిని ఉపసంహరించుకుంది. వాస్తవానికి ఈనెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ ఎదురైనట్టయింది.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు పంపిణీ విషయంలో ఇటీవల హైడ్రామా నెలకొంది. ఎన్నికల కోడ్ ఉందని, రైతుబంధు పంపిణీ చేయొద్దని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. రైతుబంధు సాయం అకౌంట్లలో పడితే రైతులు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపే అవకాశముందని ఆ పార్టీ నేతలు ఈసీకి కంప్లయింట్ చేశారు. ఈ నేపథ్యంలో రైతుబంధు సాయాన్ని విడుదల చేయడానికి అవకాశమివ్వాలంటూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈసీని కోరింది. సరిగ్గా ఎన్నికల వేళ.. రైతుబంధు సాయం విడుదల చేసేందుకు ఈసీ రెండు రోజుల క్రితం అనుమతి ఇచ్చింది. అయితే ఆ సాయం ఈనెల 28లోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పింది.
సడన్ గా ఇప్పుడు అనుమతి లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. రైతుబంధు పంపిణీ ఆపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. రబీ సీజన్ రైతు బంధు సాయం పంపిణీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఎన్నికల ముందు రైతుబంధు సాయం పంపిణీ సరికాదంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో రైతుబంధు ఆగిపోయింది. రైతులు దిగాలు పడ్డారు.