నగలు, నగదు సీజ్.. ఈసారి తెలంగాణలో రికార్డు బ్రేక్
నగదు, బంగారంతోపాటు.. ఉచిత వస్తువులు కూడా పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన బియ్యం, కుక్కర్లు, కుట్టు మిషన్లను పోలీసులు సీజ్ చేశారు.
2018 ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలీసు తనిఖీల్లో దొరికిన మొత్తం సొత్తు విలువ 103కోట్ల రూపాయలు. 2023 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కేవలం 9 రోజుల్లో దొరికిన సొత్తు విలువ 130 కోట్ల రూపాయల పైమాటే. ఈ పోలిక చాలు ఈసారి తెలంగాణ ఎన్నికలు ఎంత కాస్ట్ లీ గా మారిపోయాయో చెప్పడానికి. డబ్బుసంచులు తెలంగాణకు తరలి వస్తున్నాయి. దొరికిన సొత్తు 130 కోట్లు మాత్రమే, దొరకనిది ఇంకెంత ఉందో ఊహించలేమంటున్నారు.
నిఘా కట్టుదిట్టం..
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ లు - 373
స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు - 374
సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు - 95
ఇవి కాకుండా ఎక్కడికక్కడ పట్టణాలు, గ్రామాల్లో పోలీసులు ర్యాండమ్ గా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అజ్ఞాత వ్యక్తులనుంచి ఫోన్ కాల్స్ వచ్చినా సరే వెంటనే అక్కడ వాలిపోతున్నారు. తనిఖీల్లో అక్రమ సొమ్ము, నగలు స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈ నెల 9 నుంచి 17 వరకు తెలంగాణ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ.101.18 కోట్లకుపైగా విలువైన నగదు, మద్యం, బంగారం, ఆభరణాలు, ఇతర వస్తువులను పోలీసులు, ఎన్నికల టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు రాష్ట్ర ఎక్స్ పెండిచర్ నోడల్ ఆఫీసర్ మహేష్ భగవత్, నోడల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ జైన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
నగదు, బంగారంతోపాటు.. ఉచిత వస్తువులు కూడా పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన బియ్యం, కుక్కర్లు, కుట్టు మిషన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈసారి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం విశేషం. మద్యంతోపాటు నల్లబెల్లం, గంజాయి కూడా పోలీసు తనిఖీల్లో బయటపడింది.