Telugu Global
Telangana

వార్డు ఆఫీసుల ఎఫెక్ట్.. వేగంగా పరిష్కారం అవుతున్న సమస్యలు

జూన్ 16 నుంచి ఇప్పటి వరకు వార్డు కార్యాలయాల ద్వారా 1,800 కంప్లైంట్లు రాగా.. వాటిలో 80 శాతం అంటే 1,600 కంప్లైంట్లు అధికారులు పరిష్కరించారు.

వార్డు ఆఫీసుల ఎఫెక్ట్.. వేగంగా పరిష్కారం అవుతున్న సమస్యలు
X

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను రిజిస్ట్రేషన్ చేసుకొని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు గాను వార్డు కార్యాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది జూన్ 16న జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో కార్యాలయాలు ప్రారంభించారు. రెండు నెలల వ్యవధిలో వార్డు కార్యాలయాల ద్వారా సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నట్లు ఒక అధ్యయనంలో తెలిసింది. ఈ వార్డు కార్యాలయాలకు మురుగు, మంచి నీటికి సంబంధించిన కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయి.

జూన్ 16 నుంచి ఇప్పటి వరకు వార్డు కార్యాలయాల ద్వారా 1,800 కంప్లైంట్లు రాగా.. వాటిలో 80 శాతం అంటే 1,600 కంప్లైంట్లు అధికారులు పరిష్కరించారు. గతంలో మురుగు నీరు, మంచి నీటికి సంబంధించిన ఏవైనా కంప్లైంట్లు సర్కిల్ ఆఫీసుల్లో ఇచ్చినప్పటి కంటే.. వార్డు కార్యాలయాల్లో వేగంగా పరిష్కరిస్తున్నట్లు వెల్ఫేర్ అసోసియేషన్లు చెబుతున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు వర్గాల సమాచారం మేరకు.. నీటి కాలుష్యం, డ్రైనేజీల ఓవర్ ఫ్లో వంటి కంప్లైంట్లే ఎక్కువగా వచ్చాయి.

ప్రతీ వార్డు కార్యాలయంలో వాటర్ బోర్డుకు చెందిన వార్డు అసిస్టెంట్లను కూడా నియమించారు. దీంతో చాలా వరకు సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నారు. వార్డు కార్యాలయంలో అందిన ఫిర్యాదులను వెంటనే వాటర్ బోర్డు ఓఅండ్ఎం డివిజన్ మేనేజర్లకు ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో వాటర్ బోర్డు సిబ్బంది అదే రోజు సదరు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

నగరంలోని ప్రతీ వార్డులో ఆయా సమస్యల పరిష్కారానికి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్‌(ఎస్ఎల్ఏ) ఏర్పాటు చేశారు. ఏ సమస్యను ఎంత సమయంలో పరిష్కరిస్తారో తెలియజేసే సిటిజన్ చార్టు లాంటిదే ఇది. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల్లో 80 శాతం ఎస్ఎల్ఏ ప్రకారం పరిష్కరించినట్లు తెలుస్తున్నది. పరిష్కరించిన 1,600 ఫిర్యాదుల్లో 1,050 కంప్లైంట్లు మురుగు నీటికి సంబంధించినవే ఉన్నాయి. ఇక మిగిలినవి నీటి సరఫరా, నీటి కాలుష్యానికి సంబంధించినవని అధికారులు చెప్పారు.

First Published:  27 Aug 2023 8:34 AM IST
Next Story