తెలంగాణలో ఫెంగల్ తుపాను ప్రభావం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడును ముంచెత్తి, ఏపీని వణికిస్తున్న ఫెంగల్ తుపాను.. తెలంగాణపైనా ప్రభావం చూపించనుందని ఐఎండీ తెలిపింది.
నెరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను గడిచిన 6 గంటల్లో వేగంగా కదలుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సాయంత్రానికి కారైకాల్ -మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో దక్షిణకోస్తా, రాయలసీమలో పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరోవైపు తెలంగాణపైనా ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నాది.
ఇక ఆది, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడనున్నాయి. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. అలాగే చలి తీవ్రతా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.