Telugu Global
Telangana

ఆ ఓటు కాంగ్రెస్ కి, ఈ ఓటు బీజేపీకి.. లాజిక్ చెప్పిన ఈటల

ముక్కోణపు పోటీలో అదృష్టంతో బీజేపీకి లభించిన సీట్లు అవి. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు తారుమారవుతాయని ఆ పార్టీ నేతలు ఆశించడమే ఇక్కడ కొసమెరుపు.

ఆ ఓటు కాంగ్రెస్ కి, ఈ ఓటు బీజేపీకి.. లాజిక్ చెప్పిన ఈటల
X

అధికారం మాదేనంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన బీజేపీకి ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ ప్రజలు తమవెంటే ఉంటారని లాజిక్ చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేసినవారే, లోక్ సభ ఎన్నికల విషయానికొచ్చేసరికి బీజేపీ స్టాండ్ తీసుకుంటారని అన్నారు. ఆ నమ్మకం తమకి ఉందని, తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పెరిగాయని చెప్పుకోవడం మినహా.. బీజేపీ నేతలకు మాత్రం అవి మింగుడు పడని ఫలితాలుగా మారాయి. పేరుగొప్ప ఎంపీలు అసెంబ్లీ స్థానాల్లో మట్టికరిచారు. ఉప ఎన్నికలను ధీటుగా ఎదుర్కొన్న ఈటల, చివరకు రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఒకరకంగా బీఆర్ఎస్ ఓట్లశాతం, సీట్లు పెరిగినా దాన్ని ఆ పార్టీ గొప్పతనంగా చెప్పుకోలేం. ముక్కోణపు పోటీలో అదృష్టంతో బీజేపీకి లభించిన సీట్లు అవి. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు తారుమారవుతాయని బీజేపీ నేతలు ఆశించడమే ఇక్కడ కొసమెరుపు.

ఈటల లాజిక్ ఏంటంటే..?

కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేశారని అంటున్నారు ఈటల రాజేందర్‌. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం వారంతా బీజేపీకే ఓటు వేస్తారంటున్నారు. మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదని, 10 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని, మహిళలు, యువత అంతా కలిసి మోదీని మరోసారి గెలిపించుకోవాలని సూచించారు. గత కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలేనని, మోదీ నాయకత్వంలో ఎలాంటి మచ్చ లేకుండా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు ఈటల. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై కోపం ఉన్న వారు కాంగ్రెస్ కి ఓటు వేస్తే.. ఆరు గ్యారెంటీల విషయంలో అసంతృప్తి ఉన్నవారు ఇప్పుడు బీఆర్ఎస్ ని ప్రత్యామ్నాయంగా ఎన్నుకుంటారు కానీ.. బీజేపీకి ఎందుకు ఓటు వేస్తారో ఈటలకే తెలియాలి.

First Published:  26 Feb 2024 12:20 PM IST
Next Story