విషం చిమ్ముతున్నారు.. అయినా ఎదుర్కొంటాం
తమపై కొంతమంది విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఈటల. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చాప కింద నీరులా తాము పని చేసుకుంటున్నామని చెప్పారు.
వైరి వర్గం బండికి అధిష్టానం చెక్ పెట్టడం, పనిలో పనిగా తనకు కూడా చెప్పుకోదగ్గ పోస్ట్ ఇవ్వడంతో ఈటల రాజేందర్ స్వరం మారింది. నిన్న మొన్నటి వరకూ తెలంగాణ బీజేపీలో అతిథి పాత్ర పోషించిన ఈటల ఇప్పుడు మెయిన్ లీడ్ గా తెరపైకి వచ్చారు. వరంగల్ మోదీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన, తమపై కొంతమంది విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చాప కింద నీరులా తాము పని చేసుకుంటున్నామని చెప్పారు. కుట్రలను, కావాలని సృష్టించే ఆరోపణలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మబోరని తెలిపారు ఈటల.
బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే ప్రధాని మోదీ వస్తున్నారని చెప్పారు ఈటల రాజేందర్. ఎన్నో ఏళ్ల కల అయిన వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆయన భూమిపూజ చేస్తారని అన్నారు. మొదటి సారి ప్రధాని వస్తున్న సందర్భంలో ఘనస్వాగతం పలకాలని ప్రజలను కోరారు. బీజేపీకి బలమైన కేంద్రంగా వరంగల్ జిల్లా ఉందని అన్నారు ఈటల. ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ బీజేపీ అని అన్నారు ఈటల.
తాము తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తామని చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్. తెలంగాణ గడ్డ మీద 2019 నుంచి బీజేపీ విజయ పరంపర మొదలైందని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, టీచర్ ఎమ్మెల్సీ లను గెలిచామని గుర్తు చేశారు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు ఈటల రాజేందర్. పార్టీ పదవుల మార్పులు చేర్పులు జరగక ముందు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో ఈటల సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు పదవి రావడంతో ఆయన హడావిడి మొదలైంది. అన్నీ తానై ఇప్పుడు ఈటల, మోదీ పర్యట భారాన్ని తలకెత్తుకున్నారు.