Telugu Global
Telangana

అయ్యోపాపం.. డిపాజిట్ల లెక్కలు చెబుతున్న ఈటల

బీజేపీ సంగతి సరే అసలు ఈటల రాజకీయ భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొన్న ఈటల, ఈసారి మాత్రం చతికిలపడ్డారు.

అయ్యోపాపం.. డిపాజిట్ల లెక్కలు చెబుతున్న ఈటల
X

మా పరిస్థితి బాగా మెరుగైంది, గెలిచిన స్థానాలు కాకుండా 19చోట్ల రెండో స్థానంలో ఉన్నాం, 46 స్థానాల్లో డిపాజిట్లు సాధించాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల పనితీరు గురించి ఈటల చెబుతున్న గొప్పలివి. ఆఖరికి డిపాజిట్ల లెక్కలు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు ఈటల. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 100 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి పరువు పోగొట్టుకుంది బీజేపీ. అదే బీజేపీ ఇప్పుడు బాగా పుంజుకుంది అని చెప్పడానికి ఈటల ఇలా డిపాజిట్ల లెక్కలు చెప్పుకుంటున్నారు. ఇదే ఊపులో పార్లమెంట్ ఎన్నికల్ని ఎదుర్కొంటామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


ఈటల భవిష్యత్ ఏంటి..?

బీజేపీ సంగతి సరే అసలు ఈటల రాజకీయ భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఈటలకు వచ్చిన ఓట్లు లక్షా ఏడువేలు. ఈ ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఆయన స్కోర్ 63,460. ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొన్న ఈటల, ఈసారి మాత్రం చతికిలపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ గెలవడం విశేషం. అంటే హుజూరాబాద్ లో ఎమ్మెల్యేగా ఇప్పుడు కౌశిక్ రెడ్డి హవా ఉంటుంది. అధికార పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ చార్జ్ హడావిడి కూడా ఉంటుంది. రాజకీయంగా ఈటల రాజేందర్ ప్రయారిటీ ఇక్కడ చాలా తక్కువ. సొంత నియోజకవర్గంలో ఈటల తన పట్టు ఎలా పెంచుకుంటారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం.

లోక్ సభకు ధైర్యం చేస్తారా..?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ వరకు అవకాశముంది. కాంగ్రెస్, బీజేపీలో చాలామంది అదే పని చేస్తారు. పైగా బీజేపీలో ఎంపీలుగా ఉండి కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులున్నారు. వారితో కలసి ఈటల కూడా లోక్ సభ బరిలో నిలుస్తారా అనేది తేలాల్సి ఉంది. అదే జరిగితే.. మోదీ ఊపులో ఈటల గెలిస్తే.. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఆయనకు మరింత దూరం పెరిగే అవకాశముంది. ఎప్పటికైనా బీఆర్ఎస్ పై పగ సాధించాలనేది ఈటల ఆశ. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన పంతం నెగ్గించుకున్నారని అనుకున్నా.. అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి మరీ చతికిలపడేసరికి ఈటల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిస్తే కనీసం ఈటల పరువు నిలబడే అవకాశం ఉంది.

First Published:  9 Dec 2023 8:03 PM IST
Next Story