బీజేపీలో ఈటలకు మరో అవమానం..
ఖమ్మంలో నిరుద్యోగ ర్యాలీ చేపట్టిన బండి సంజయ్.. కనీసం ఆ కార్యక్రమం బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలలో ఈటలకు చోటు కూడా ఇవ్వలేదు.
ఈటల రాజేందర్ ఆవేశంలో బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచినా ఆ తర్వాత ఆయన అనుకున్నంత ప్రయారిటీ ఆ పార్టీలో దక్కలేదు. ఆ విషయం ఈటలకు కూడా తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కమలం గూటిలో కొనసాగుతున్నారు. చేరికల కమిటీకి చైర్మన్ ని చేసినా కూడా పార్టీ వ్యవహారాల్లో అది ప్రొటోకాల్ పోస్ట్ కాదు. అందులోనూ బీజేపీలో బీసీ గొడవ ముదిరిపోయింది. బీసీ కార్డ్ బండి సంజయ్ కే అన్నట్టుగా మారిపోయింది. తనని తాను మోదీ శిష్యుడు, అమిత్ షా భక్తుడు అని చెప్పుకుంటూ బండి.. ఈటలను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఖమ్మంలో నిరుద్యోగ ర్యాలీ చేపట్టిన బండి సంజయ్.. కనీసం ఆ కార్యక్రమం బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలలో ఈటలకు చోటు కూడా ఇవ్వలేదు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే ఆరుణ సహా స్థానిక నాయకులు హైలెట్ అయ్యారు కానీ చేరికల కమిటీ చైర్మన్ అయినా కూడా ఈటల ఫొటో వేయలేదని ఆయన అనుచరులు హర్ట్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే ఈటలను అవమానించారంటున్నారు.
ఆధిపత్యపోరు..
తెలంగాణ బీజేపీలో అసలు నేతలు, వలస నేతలు అనే వ్యత్యాసం రోజు రోజుకీ పెరిగిపోతోంది. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన ఈటల పూర్తి స్థాయి బీజేపీ నేతగా ఇంకా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. అధిష్టానం అండదండలున్నాయని ఈటల చెప్పుకుంటున్నా, రాష్ట్రంలో మాత్రం ఆయనకు అడుగడుగునా సహాయనిరాకరణే కనిపిస్తోంది. ఈటల బీజేపీ నుంచి వెళ్లిపోతున్నారనే ప్రచారం కూడా సొంత పార్టీనుంచే మొదలైందని అంటున్నారు. ఇటీవల ఆయన దానికి వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అయితే ఈటల కూడా వెనక్కి తగ్గేలా కనపడ్డంలేదు. అనువుగానిచోటే అధికుడ్ని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితో సంబంధం లేకుండానే పార్టీలో చేరికలకోసం ఆయన సొంత ప్రయత్నాలు మొదలు పెట్టారు. పొంగులేటి, జూపల్లిని నేరుగా కలిశారు. ఆ చర్చల గురించి తనకు సమాచారం లేదని బండి సంజయ్ మీడియాకు చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అవకాశం వచ్చినప్పుడల్లా బండికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈటల. సమయంకోసం వేచి చూస్తున్నారు బండి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు లేదని ఇటీవల పదే పదే కిషన్ రెడ్డి వంటి నేతలు కూడా చెప్పడం ఈ ఆధిపత్యపోరులో భాగమే. మొత్తమ్మీద ఈటలకు బీజేపీలో నెగ్గుకురావడం అంత సులభం కాదని అర్థమైంది. ఇప్పటికిప్పుడు బయటకు రాలేక, ఇంటిపోరు పడలేక కాలం నెట్టుకొస్తున్నారు రాజేందర్.