DAV స్కూల్ వ్యవహారంలో కీలక మలుపు..
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన పేరెంట్స్ కమిటీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో LKG విద్యార్థినిపై లైంగిక దాడి వ్యవహారంతో DAV స్కూల్ యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేసింది, అక్కడ చదువుతున్న పిల్లలకు నష్టం లేకుండా సమీపంలోని పాఠశాలల్లో చేర్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే విద్యా సంవత్సరం మధ్యలో ఇలా పిల్లలను ఇబ్బందులు పెట్టొద్దంటూ పేరెంట్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది వరకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇద్దరు చేసిన తప్పుకి వందలాది మంది విద్యార్థులను కష్టపెట్టొద్దని విన్నపాలు చేశారు. దీంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన పేరెంట్స్ కమిటీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.
ఢిల్లీ నుంచి DAV స్కూల్ మేనేజ్‌మెంట్ తరఫున ఇద్దరు సభ్యులు, సఫిల్ గూడ నుంచి ముగ్గురు మేనేజ్‌మెంట్ సభ్యులు.. విద్యాశాఖ కమిషనర్, పేరెంట్స్ కమిటీతో చర్చలు జరిపారు. స్కూల్ మేనేజర్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగవని హామీ ఇచ్చారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
అటు పేరెంట్స్ మాత్రం కొత్త స్కూల్స్ లో తమ పిల్లల్ని చేర్పించేందుకు ఇష్టంగా లేరు. దీంతో అధికారులు కూడా పునరాలోచనలో పడ్డారు. మరోవైపు ఐదో తరగతి వరకే అనుమతి ఉన్నా.. ఆరు, ఏడు తరగతులను కూడా DAV బంజారాహిల్స్ బ్రాంచ్‌లో నిర్వహిస్తున్నట్టు విచారణలో తేలింది. దీనిపై కూడా అధికారులు సీరియస్ అయ్యారు. అయితే పేరెంట్స్ విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ స్థాయిలో వారికి సానుకూల స్పందన లభించింది. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.