Telugu Global
Telangana

దశాబ్ది సంబరం.. నేడు విద్యా దినోత్సవం

మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా అదనపు హంగులద్దుకున్న పాఠశాలలను నేడు ప్రారంభిస్తారు. 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ ను కూడా ఇదేరోజు ప్రారంభిస్తారు.

దశాబ్ది సంబరం.. నేడు విద్యా దినోత్సవం
X

తెలంగాణ దశాబ్ది సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. 21రోజులపాటు జరిగే ఉత్సవాల్లో నేడు 19వరోజున విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు ఏర్పాటు చేస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా అదనపు హంగులద్దుకున్న పాఠశాలలను నేడు ప్రారంభిస్తారు. 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ ను కూడా ఇదేరోజు ప్రారంభిస్తారు. విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు.

నేటినుంచి రాగిజావ..

తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. విద్యా దినోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి రాగిజావ అందిస్తారు. రాష్ట్రంలోని 25,26,907 విద్యార్థులకు ఉదయం 250 మిల్లీలీటర్ల రాగిజావ అందించబోతున్నారు. రాష్ట్రంలోని 19,800 ప్రాథమిక పాఠశాలలకు ట్యాబ్‌ లను పంపిణీ చేస్తారు. 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు.

ఈ విద్యాసంవత్సరం నుంచి..

తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యారంగంలో సమూల మార్పు కనిపించింది. గురుకులాలు, హాస్టళ్లు, యూనివర్శిటీలు.. మనబడి కార్యక్రమం ద్వారా ఆధునీకరించిన తరగతి గదులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతిలోనూ ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో 245 పాఠశాలలను ఇంటర్‌ వరకు విస్తరించారు. దివ్యాంగ పిల్లల కోసం ఇప్పటికే 467 భవిత కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2014 తర్వాత తెలంగాణలో కొత్తగా 15 డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి.

First Published:  20 Jun 2023 6:49 AM IST
Next Story