Telugu Global
Telangana

లైగర్ ఎఫెక్ట్.. ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ

ఫస్ట్ ఎపిసోడ్ లో ఛార్మి, పూరీని విచారించిన ఈడీ.. సెకండ్ ఎపిసోడ్ కి హీరో విజయ్ దేవరకొండను పిలిపించింది. సినిమా ఆర్థిక లావాదేవీలపై ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

లైగర్ ఎఫెక్ట్.. ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ
X

లైగర్ సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే విడుదలకు ముందు, విడుదల తర్వాత ఆ సినిమా క్రియేట్ చేసిన సంచలనాలు చాలానే ఉన్నాయి. సినిమా ఫలితం అనుకున్నట్టుగా రాకపోవడంతో నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మి తీవ్రంగా నష్టపోయారనేది అప్పట్లో బయటకొచ్చిన సమాచారం. అయితే విచిత్రంగా వారు ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి. ఫస్ట్ ఎపిసోడ్ లో ఛార్మి, పూరీని విచారించిన ఈడీ.. సెకండ్ ఎపిసోడ్ కి హీరో విజయ్ దేవరకొండను పిలిపించింది. సినిమా ఆర్థిక లావాదేవీలపై ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఈడీ విచారణ ఎందుకు..?

భారీ బడ్జెట్ సినిమాలు చాలానే విడుదలవుతుంటాయి, వాటికి మార్కెటింగ్ కూడా భారీగానే జరుగుతుంది. కానీ లైగర్ సినిమా మాత్రమే ఈడీకి దొరికింది. కారణం ఏంటంటే.. ఈ సినిమాకోసం పెట్టిన బడ్జెట్ అక్రమ మార్గాల ద్వారా ఇండియాకు తరలించారనే ఆరోపణలున్నాయి. ముందుగా దుబాయ్ కి హవాలా రూపంలో ఇక్కడినుంచే డబ్బులు పంపించి, అక్కడినుంచి భారత్ కి వాటిని తిరిగి తెప్పించి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేశారని, అందుకే ఈడీ ఈ లావాదేవీలను బయటకు తీస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో దర్శక నిర్మాతలు, చివరకు హీరో కూడా ఈడీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది.

లైగర్ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోవడంతోపాటు, ఆ సినిమా పంపిణీ హక్కుల్లో కూడా హీరో విజయ్ దేవరకొండకు భాగస్వామ్యం ఉందనే ప్రచారం జరిగింది. అంటే సినిమా నిర్మాణంలో కూడా ఆయన భాగస్వామి అయినట్టే లెక్క. దీంతో ఆయన కూడా ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. లైగర్ సినిమా రిజల్ట్ తో విజయ్ దేవరకొండ గ్రాఫ్ కాస్త తగ్గింది. వరుస విజయాలతో ఉన్న హీరోకి ఒక్కసారిగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయింది. గతంలో కూడా ఇలాంటి ఫలితాలు విజయ్ కి ఎదురైనా, ఇది అతిపెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి.

ఈ వ్యవహారంలో కొంతమంది రాజకీయ నాయకులకు కూడా సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో 'లైగర్‌' సినిమా నిర్మాణంలో భాగస్వాములైన అందర్నీ అధికారులు పిలిపించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో విచారణకు హాజరైన ఛార్మి, పూరీ.. తమని ఏమేం ప్రశ్నలు అడిగారనే విషయాన్ని బయటకు చెప్పలేదు. మరి విజయ్ ఈ వ్యవహారంపై నోరు తెరుస్తారో లేదో చూడాలి.

First Published:  30 Nov 2022 12:14 PM IST
Next Story