Telugu Global
Telangana

కవితకు నోటీసులు.. భగ్గుమన్న నేతలు..

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా ఈడీ నోటీసులపై స్పందించారు. ప్రశ్నించిన వారిపై బీజేపీ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కవితకు నోటీసులు.. భగ్గుమన్న నేతలు..
X

ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఇది మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారాయన. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని, కేంద్రం ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తోందన్నారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదని అన్నారు. నియంతలు నిలబడినట్లు చరిత్రలో లేదని, బీజేపీ అసలు రూపాన్ని ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తామని చెప్పారు జగదీష్ రెడ్డి.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈడీ నోటీసులను ఖండించారు. కవితమ్మ ఎక్కడా తప్పు చేయలేదని ఆయన అన్నారు. అరెస్టులు చేసినా నోటీసులు ఇచ్చినా వెనక్కు తగ్గేది లేదన్నారు ఎర్రబెల్లి. కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఈడీ నోటీసులపై మండిపడ్డారు. మహిళా దినోత్సవాన తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కానుకలు ఇస్తుంటే, కేంద్రంలోని బీజేపీ మాత్రం రాష్ట్రంలోని మహిళా నేతలకు నోటీసులిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాడదామని అనుకున్న కవితకు నోటీసులు ఇవ్వడం బీజేపీ పతనానికి నాంది అని అన్నారామె.

ఎమ్మెల్యేలను కొని తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిన బీజేపీ, అది కుదరకపోయే సరికి, కవితను టార్గెట్ చేసిందని అన్నారు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. అదానీ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ విస్తరించడం వల్లే కేంద్రం భయపడి ఇలా కేసుల పేరుతో తమ దారికి తెచ్చుకోవాలని చూస్తోందని అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా ఈడీ నోటీసులపై స్పందించారు. ప్రశ్నించిన వారిపై బీజేపీ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐకి బడ్జెట్ నిధులను పెంచి, గల్లీగల్లీకి బ్రాంచ్ ఓపెన్ చేసి విపక్షాలను అరెస్ట్ చేయాలంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. శవాలను కూడా విచారించే నియమాలను తీసుకురండి అంటూ దుయ్యబట్టారు.

అబ్బెబ్బే మాకేం సంబంధం..!!

ఈడీ నోటీసులపై తెలంగాణ బీజేపీ నేతలు వెంటనే స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. స్వల్ప వ్యవధిలో ఈడీ నోటీసులపై స్పందించారు. అసలు నోటీసులకి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. దర్యాప్తు సంస్థలకు ఎవరూ మార్గనిర్దేశనం చేయబోరని చెప్పారు. గుమ్మడికాయల దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్టు బీజేపీ నేతల రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.

First Published:  8 March 2023 3:34 PM IST
Next Story