బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు
బెంగళూరు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి,టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.తనకు నోటీసులు జారీ అయిన విషయాన్ని రోహిత్ రెడ్డి ధృవీకరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడి అధికారులు పేర్కొన్నారు. తనకు నోటీసులు జారీ అయిన విషయాన్ని రోహిత్ రెడ్డి ధృవీకరించారు. తన వ్యాపారం, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల బ్యాంక్ వివరాలు అడిగారని రోహిత్ చెప్పారు.అయితే, ఏ కేసులో నోటీసులు ఇచ్చారో తెలియదన్నారు. ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే.
బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఉన్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, ఆ కేసులో నిందితులను వదిలిపెట్టబోమని కూడా సంజయ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు రావడం చర్చనీయాంశమవుతోంది.
ఇదిలా ఉండగా, సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో గతంలో రకుల్ సహా పలువురు టాలీవుడ్ నటీనటులను విచారించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరోసారి మిగితా వారిని కూడా త్వరలో ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.