తెలంగాణలో ఈడీ దూకుడు.. ఈసారి టార్గెట్ కాంగ్రెస్...
మునుగోడు ఉప ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొనబోతున్న నేతల్ని ఈడీ కేసులతో భయపెడుతున్నారని, పార్టీ శ్రేణులను కలవరపెట్టేలా చేస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. ఈడీ కేసులతో భయపెట్టినా కాంగ్రెస్‌ని బీజేపీ ఏమీ చేయలేదని అంటున్నారు.
తెలంగాణలో ఈడీ మళ్లీ దూకుడు పెంచింది. ఈసారి కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తూ వారికి నోటీసులు ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీకి నోటీసులిచ్చారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2005లోని సెక్షన్ 50 కింద కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 10న సుదర్శన్ రెడ్డి ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా.. అక్టోబర్ 11న షబ్బీర్ అలీని విచారణకు పిలిచారు. నేషనల్ హెరాల్డ్ విచారణలో పాల్గొన్న కంపెనీల ఖాతాలకు వీరిద్దరూ నగదు బదిలీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
జోడో ప్రభావం పనిచేసినట్టేనా..?
కొంతకాలంగా వివిధ రాష్ట్రాల్లోని విపక్ష నేతల్ని కేంద్రం టార్గెట్ చేస్తోంది. తమకు రాజకీయంగా అడ్డుతగులుతారు అనుకున్నవారిని తొలగించుకునే ప్రయత్నాల్లో కేంద్రం దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటోంది. ఆమధ్య నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా విచారణకు హాజరయ్యారు. అప్పట్లో ఢిల్లీలో పెద్ద హడావిడి జరిగింది. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లు ఈడీ స్తబ్దుగా ఉంది. ఈలోగా ఇతర వ్యవహారాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు మళ్లీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పేరు మారుమోగుతుండే సరికి ఇలా ఈడీ అస్త్రాన్ని బయటకు తీస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి.
మునుగోడుపై ప్రభావం ఉంటుందా..?
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనుకుంటోంది కాంగ్రెస్. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా.. క్యాడర్ చేజారకుండా చూసుకుంటోంది. కాంగ్రెస్ నేతలంతా మునుగోడులో మకాం వేయబోతున్నారు. ఈ దశలో ఇప్పుడు ఈడీ విచారణ అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టేలా చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొనబోతున్న నేతల్ని ఈడీ కేసులతో భయపెడుతున్నారని, పార్టీ శ్రేణులను కలవరపెట్టేలా చేస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. ఈడీ కేసులతో భయపెట్టినా కాంగ్రెస్‌ని బీజేపీ ఏమీ చేయలేదని అంటున్నారు. నేషనల్ హెరాల్డ్ విచారణ ఇప్పటికే సాగదీతలా మారింది. అవసరం అనుకున్నప్పుడే కేంద్రం ఈ కేసుని పట్టి పట్టి చూస్తోంది..పట్టు బిగిస్తోంది.