టార్గెట్ తెలంగాణ, తమిళనాడు.. ఒకేసారి ఈడీ, ఐటీ దాడులు
ఎమ్మెల్యేల ఇళ్లలో ఆదాయపుపన్ను అధికారుల సోదాల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సోదాలు కక్ష సాధింపు చర్యలని ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలు చాన్నాళ్లుగా వినపడుతూనే ఉన్నాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈడీ, ఐటీ, సీబీఐని.. కేంద్రం రాజకీయ కక్షసాధింపులకోసం వాడుకుంటోందని మరోసారి రుజువైంది. తమిళనాడుకి ఈడీని పంపించారు, తెలంగాణకు ఐటీని పంపించారు. రెండు రాష్ట్రాల్లో మాట వినని ప్రభుత్వాలను బెదిరించే ప్రయత్నం చేశారు.
ఏకకాలంలో అటు ఈడీ, ఇటు ఐటీ విభాగాలు రెండు దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. తమిళనాడుకి చెందిన మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసింది ఈడీ. ఇటు తెలంగాణలో కూడా అధికార బీఆర్ఎస్ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీపై ఐటీ దాడులు జరిగాయి. కొండను తవ్వినా ఎలుకను కూడా పట్టుకోలేనట్టుగా ఐటీ కేవలం సోదాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఐటీ అధికారులతో కూడిన 60 బృందాలు తెలంగాణలో సోదాలు నిర్వహించాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లు, వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఇది కుట్ర రాజకీయమని, బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికి కేంద్రం చేయిస్తున్న దాడులు ఇవని ఆరోపించారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి.
ఎమ్మెల్యేల ఇళ్లలో ఆదాయపుపన్ను అధికారుల సోదాల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సోదాల సంగతి తెలియగానే పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్ల వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కక్ష సాధింపు చర్యలని ఆరోపించారు.