ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు
కవిత కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు మరో ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు.
ఎమ్మెల్సీ కవితను మరో మూడురోజులు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. గత వారం నుంచి ఆమె ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఆ కస్టడీ గడువు ఈరోజుతో తీరిపోయింది. ఈరోజు ఆమెను తిరిగి కోర్టులో హాజరు పరిచారు ఈడీ అధికారులు. మరో మూడు రోజులు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
కవిత కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు మరో ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు. కవిత కుటుంబసభ్యుల వ్యాపార లావాదేవీలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని తెలిపారు. కవితకు ప్రతి రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆమెకు వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని వెల్లడించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. అంటే ఈనెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉంటారన్నమాట.
న్యాయపోరాటం చేస్తా..
కవితను న్యాయస్థానంలో ప్రవేశ పెట్టేందుకు తీసుకెళ్తున్న సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తన అరెస్టు అక్రమం అని, తప్పుడు కేసులో తనను ఇరికించారని చెప్పారు. తాను న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు కవిత. కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించినా.. బెయిల్ కోసం కవిత ప్రయత్నిస్తున్నారు. సీబీఐ కోర్టులో ఆమె తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మొదట సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. కింది కోర్టులోనే బెయిల్ కోసం దరఖాస్తు చేయాలని సూచించడంతో కవిత సీబీఐ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేశారు.