Telugu Global
Telangana

మునుగోడు మాజీ ఆర్వో సస్పెన్షన్‌కు ఈసీ ఆదేశాలు

రిటర్నింగ్ ఆఫీసర్‌కు తగినంత భద్రత కల్పించలేక పోయిన సంబంధిత డీఎస్పీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని.. ఏ చర్యలు తీసుకున్నారో కూడా లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

మునుగోడు మాజీ ఆర్వో సస్పెన్షన్‌కు ఈసీ ఆదేశాలు
X

మునుగోడు ఉపఎన్నిక మాజీ రిటర్నింగ్ ఆఫీసర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సదరు సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రతిని తమకు వెంటనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఈసీ సూచించింది. ఉపఎన్నికకు సంబంధించి గతంలో కేవీఎం జగన్నాథరావు ఆర్వోగా వ్యవహరించారు. అయితే యుగ తులసి పార్టీ అభ్యర్థికి 'రోడ్డు రోలర్' గుర్తు కేటాయించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆర్వో జగన్నాథరావు సదరు గుర్తును తీసేసి బేబీ వాకర్‌ను కేటాయించారు.

తన గుర్తు మార్చడంపై యుగ తులసి పార్టీ అభ్యర్థి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీంతో వెంటనే పాత రోడ్డు రోలర్ గుర్తునే కేటాయిస్తూ ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అంతే కాకుండా ఆర్వోను విధుల నుంచి తప్పించింది. తాజాగా ఆయనను సస్పెండ్ చేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. శుక్రవారం ఉదయం 11 గంటల లోపు సస్పెన్షన్ ఉత్వర్వుల ప్రతిని ఢిల్లీకి పంపాలని కూడా కోరింది.

రిటర్నింగ్ ఆఫీసర్‌కు తగినంత భద్రత కల్పించలేక పోయిన సంబంధిత డీఎస్పీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని.. ఏ చర్యలు తీసుకున్నారో కూడా లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లను నియమించాలని జిల్లా ఎన్నికల అధికారికి సీఈవో వికాస్ రాజ్ ఉత్తర్వలు జారీ చేశారు. ఎన్నికల నియమావళి, వ్యయ నిబంధనలు ఉల్లంఘించే రాజకీయ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. సీవిజిల్ యాప్ ద్వారా ప్రజలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని, దీనిపై అవగాహన కల్పించాలని వికాస్ రాజ్ అధికారులకు సూచించారు. ప్రజలు నుంచి ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోగా ఆయా ప్రాంతాలకు అధికారులు వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

First Published:  28 Oct 2022 9:33 AM IST
Next Story