Telugu Global
Telangana

'రోడ్డు రోలర్' గుర్తుపై వివాదం.. ఆర్వోపై ఈసీ ఆగ్రహం

ఇతర పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో యుగతులసి పార్టీకి కేటాయించిన 'రోడ్ రోలర్' గుర్తును మార్చేసి సదరు అభ్యర్థికి 'బేబీ వాకర్' గుర్తును కేటాయించారు.

రోడ్డు రోలర్ గుర్తుపై వివాదం.. ఆర్వోపై ఈసీ ఆగ్రహం
X

మునుగోడులో అభ్యర్థులు గుర్తుల వివాదం ఇంకా నడుస్తూనే ఉన్నది. కారు గుర్తును పోలిన కొన్ని ఫ్రీ సింబల్స్‌లో ఉన్నాయని.. వాటిని ఎవరికీ కేటాయించొద్దని టీఆర్ఎస్ పార్టీ గతంలోనే ఎలక్షన్ కమిషన్ (ఈసీ)ని కోరింది. కానీ టీఆర్ఎస్ అభ్యంతర పెట్టిన గుర్తుల్లో ఒకటైన 'రోడ్ రోలర్‌'ను యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు కేటాయించారు. అప్పటికే టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది.

ఇక ఇతర పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో యుగతులసి పార్టీకి కేటాయించిన 'రోడ్ రోలర్' గుర్తును మార్చేసి సదరు అభ్యర్థికి 'బేబీ వాకర్' గుర్తును కేటాయించారు. తొలుత లాటరీలో తనకు రోడ్ రోలర్ గుర్తు రావడంతో శివకుమార్ పాంప్లెట్లు, పోస్టర్లపై ముద్రించి ప్రచారం మొదలు పెట్టారు. అయితే రిటర్నింగ్ అధికారి అకస్మాతుగా గుర్తు మార్చడంతో ఆయన ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు.

నిబంధనలకు విరుద్దంగా లాటరీలో వచ్చిన గుర్తును ఎందుకు మార్చారంటూ రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా గుర్తు ఎందుకు మార్చారో గురువారం సాయంత్రంలోగా నివేదిక పంపాలని తెలంగాణ సీఈవోను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పాత గుర్తునే సదరు అభ్యర్థికి కేటాయించాలని ఈసీ ఆదేశించడంతో.. ఫారం 7(ఏ)లో సవరణ చేసి అభ్యర్థి శివకుమార్‌కు రోడ్డు రోలర్‌నే కేటాయిస్తూ తిరిగి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

First Published:  20 Oct 2022 5:30 AM GMT
Next Story