Telugu Global
Telangana

దొడ్డిదారి ప్రకటనలు.. కర్నాటక కాంగ్రెస్ అతి తెలివిపై ఈసీ ఆగ్రహం

కర్నాటకలో ఆయా పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతూ.. తెలంగాణ ఎడిషన్లలో ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.

దొడ్డిదారి ప్రకటనలు.. కర్నాటక కాంగ్రెస్ అతి తెలివిపై ఈసీ ఆగ్రహం
X

దొడ్డిదారి ప్రకటనలతో తెలంగాణ ప్రజల్ని ప్రభావితం చేయాలని చూస్తున్న కర్నాటక ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై అలాంటి ప్రకటనలు తెలంగాణలో కనిపించకూడదని గట్టిగా చెప్పింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. కర్నాటక, తెలంగాణ ఎన్నికల సంఘాల సీఈఓలకు ఓ లేఖను పంపించింది. కర్నాటక ప్రభుత్వం తెలంగాణ ఎన్నికలకోసం విడుదల చేసిన ప్రకటనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించాయని పేర్కొంది.

కాంగ్రెస్ అతి తెలివి..

ఎన్నికల ప్రక్రియపై ప్రకటన విడుదలైన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(MCC) అమలులోకి వస్తుంది. అంటే ఎన్నికల కోసం ఇచ్చే ప్రకటనలు వాటి ఖర్చులు అన్నిటికీ లెక్కలుండాలి. ఎన్నికల సంఘం ఆమోదించిన ప్రకటనలను మాత్రమే ప్రచురించాలి. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారిన కొన్ని ప్రకటనలు జారీ చేసింది. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతను వివరిస్తూ తెలంగాణలో కూడా ప్రచురితమవుతున్న న్యూస్ పేపర్లకు ప్రకటనలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా కర్నాటక లాగే గ్యారెంటీలను ప్రకటించింది. విద్యార్థినులకు స్కూటీలు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటూ.. దాదాపుగా అక్కడ అమలవుతున్న హామీలనే ఇక్కడ కూడా ఇచ్చింది. కర్నాటకలో ఆయా పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతూ.. తెలంగాణ ఎడిషన్లలో ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఈసీ.. కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని తప్పుబట్టింది.

కర్నాట‌క ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం లేఖ రాసింది. ప్ర‌క‌ట‌న‌ల జారీ ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న కిందకు వస్తుందని ఈసీ పేర్కొంది. మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖల కార్యదర్శులపై, సమాచార శాఖపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంది. ఆ ప్రకటనలు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ప్ర‌క‌ట‌నల ప్రచురణకోసం క‌ర్నాట‌క ప్ర‌భుత్వం క‌నీసం ఈసీకి ద‌ర‌ఖాస్తు చేయ‌లేద‌ని తెలిపింది.

First Published:  27 Nov 2023 9:36 PM IST
Next Story