కేసీఆర్‌కు ఈసీ నోటీసులు.. ఎందుకంటే.!
కేసీఆర్ సిరిసిల్లలో అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఈనెల 6న ఈసీకి ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనకు మంగళవారం నోటీసులు ఇచ్చింది. ఈనెల 5న కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలు పరిశీలించిన కేసీఆర్.. అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. అయితే ఈ ప్రసంగంలో ప్రత్యర్థి పార్టీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఈసీ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నోటీసులకు ఈనెల 18 ఉదయం 11 గంటలలోగా వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. కేసీఆర్ సిరిసిల్లలో అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఈనెల 6న ఈసీకి ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని, మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసినట్లు నోటీసుల్లో గుర్తుచేసింది.
ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలపైనా సలహా ఇచ్చినట్లు తాజా నోటీసుల్లో పేర్కొంది ఈసీ. వాస్తవ విరుద్ధమైన అంశాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.. ప్రత్యర్థి లేదా ప్రత్యర్థి పార్టీలను అవమానించడమేనని స్పష్టం చేసింది.