Telugu Global
Telangana

మంత్రి జగదీష్ రెడ్డిపై ఈసీ నిషేధం

జగదీష్ రెడ్డి ఇచ్చిన సమాధానంపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. దాంతో శనివారం సాయంత్రం 7 గంటల నుంచి మొద‌లు.. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది.

మంత్రి జగదీష్ రెడ్డిపై ఈసీ నిషేధం
X

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనకుండా మంత్రి జగదీష్ రెడ్డిపై ఈసీ నిషేధం విధించింది. 48 గంటల పాటు ప్రచార కార్యక్రమాల్లో గానీ, ర్యాలీల్లో గానీ పాల్గొనవద్దని, ప్రసంగాలు చేయవద్దని, ప్రెస్‌మీట్లు కూడా పెట్టవద్దని ఈసీ ఆదేశించింది.

ఎన్నికల ప్రచారంలో ఓటర్లను మంత్రి జగదీష్ రెడ్డి బెదిరిస్తున్నారని, టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వార్నింగులు ఇస్తున్నారంటూ బీజేపీ నేత దిలీప్ కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి తొలుత ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని స్థానిక ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. అలా అందిన నివేదికను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జగదీష్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో శనివారం మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.

అందుకు స్పందించిన జగదీష్ రెడ్డి.. తన వ్యాఖ్యలపై జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డిని కలిసి సమాధానం ఇచ్చారు. తాను ఇచ్చిన సమాధానంతో ఈసీ సంతృప్తి చెందుతుందనే తాను భావిస్తున్నానని ఆ సందర్భంగా జగదీష్ రెడ్డి చెప్పారు. తాను సంక్షేమ పథకాలను ఆపేస్తామని చెప్పలేదని.. ఇతర రాష్ట్రాల్లో అమలు కానీ పథకాలు కూడా ఇక్కడ అమలవుతున్నాయన్న కోణంలోనే ప్రజలకు వివరించే ప్రయత్నం చేశానని చెప్పారు. కానీ దాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారని.. ఎన్ని ఫిర్యాదులు చేసినా తాను పట్టించుకోబోనన్నారు.

జగదీష్ రెడ్డి ఇచ్చిన సమాధానంపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. దాంతో శనివారం సాయంత్రం 7 గంటల నుంచి మొద‌లు.. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది.

First Published:  29 Oct 2022 7:42 PM IST
Next Story