తెలంగాణ బీజేపీలో ముసలం.. చేరికల కమిటీకి ఈటల దూరం
బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారని తెలుస్తోంది. కీలకమైన ఆ పదవి నుంచి తనను తప్పించాలని ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రి అమిత్ షాని కోరినట్టు సమాచారం.
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరతామంటూ జబ్బలు చరుచుకుంటున్న కమలనాథులు.. తీరా సమయం దగ్గరపడేసరికి వారిలో వారే కొట్టుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల పరాభవం బీజేపీ నాశనానికి బీజం వేసిందని చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా ఉన్నారు నేతలు. ఇటీవల ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత పార్టీ నిట్టనిలువునా చీలింది.
బండికి సొంతపార్టీ నేతలే గడ్డిపెడుతున్నారు. అలాంటి వారిపై బండి వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. మొత్తమ్మీద తెలంగాణ బీజేపీలో ఎవరికి వారే హీరో అనిపించుకోడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమైంది. ఈ దశలో పార్టీలో కీలకంగా ఉంటారనుకున్న ఈటల రాజేందర్ కూడా దూరం జరిగారు.
బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ పదవికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆ పదవి నుంచి తనను తప్పించాలని ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రి అమిత్ షాని కోరినట్టు సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికల వేళ.. చేరికల విషయంలో ఈటలతో మిగతా సీనియర్లు విభేదించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. మునుగోడు పరాభవం తర్వాత బీజేపీలో చేరికలు పెద్దగా లేవు. దీంతో ఈటల కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. చేరికలు లేకపోవడానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు నేతలు.
టికెట్ పై హామీ ఇవ్వకపోతే ఎలా..?
బీజేపీలో చేరే సీనియర్లలో కొంతమందికైనా అసెంబ్లీ టికెట్ పై హామీ ఇవ్వాలనేది ఈటల ఆలోచన. కానీ అధిష్టానం ససేమిరా అంటోంది. అదే నియోజకవర్గం నుంచి అంతకంటే పెద్ద నాయకులు వస్తే అప్పుడేం చేస్తామంటున్నారు నేతలు. దీనికి ఈటల ఒప్పుకోవడంలేదట. కనీసం కొంతమందికైనా హామీ ఇవ్వకపోతే ఎలా అంటున్నారు. ఇక్కడే సమస్య మొదలైందని, అసలు ఆ పదవే తనకు వద్దంటూ ఈటల దూరం జరిగారని తెలుస్తోంది. అధిష్టానం బుజ్జగించాలని చూసినా, ఈటల రాజీనామాకే సిద్ధమైనట్టు సమాచారం.