దొంగలెవరో చెప్పు ఈటలా..! పట్టుకుంటాం.. విజయశాంతి కౌంటర్లు
పార్టీలో దొంగతనం జరిగినప్పుడు దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత మీపై కూడా ఉందంటూ ఈటలకు బదులిచ్చారామె. దొంగల్ని పట్టుకోవాలి, వారిని పోలీసులకు అప్పగించాలన్నారు.
తెలంగాణ బీజేపీని కోవర్టు రాజకీయం ఇరుకున పెడుతోంది. పెద్ద తలకాయల్లో ఒకరంటే ఒకరికి పొసగడం లేదని స్పష్టమవుతోంది. తిరిగి తిరిగి ఇదంతా ఈటల మెడకు చుట్టుకునే ప్రమాదం కనిపిస్తోంది. ఈటలకు వరుసగా కౌంటర్లు పడుతున్నాయి. బీజేపీలో కోవర్టులు ఉండరు, బీజేపీ సిద్దాంతం కలిగిన పార్టీ అంటూ బండి సంజయ్ వివరణ ఇచ్చిన రోజుల వ్యవధిలోనే విజయశాంతి కూడా ఈటలపై తూటాలు పేల్చారు. కోవర్టులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆరోపణలు కాదు, ఆధారాలు చూపండి..
"ఊరికే కోవర్టులు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం కాదు, వారెవరో పేర్లతో సహా బయటపెట్టండి, పార్టీ చర్యలు తీసుకుంటుంది." అంటూ విజయశాంతి, ఈటలకు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో దొంగతనం జరిగినప్పుడు దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత మీపై కూడా ఉందంటూ ఈటలకు బదులిచ్చారామె. దొంగల్ని పట్టుకోవాలి, వారిని పోలీసులకు అప్పగించాలన్నారు. "నిజంగా కోవర్టులుంటే కేంద్రం కూడా వారిపై చర్యలు తీసుకుంటుంది, వారి గురించి దయచేసి నిజాలు బయటపెట్టండి. పార్టీకి మీరు మేలు చేసిన వారు అవుతారు." అని ఈటలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు విజయశాంతి.
తెలంగాణ బీజేపీలో కోవర్టులు ఉన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఈటల మాత్రం కోవర్టు రాజకీయాల పేరుతో అందరికీ టార్గెట్ అయ్యారు. అసలే బీజేపీలో అసంతృప్తితో ఉన్న ఈటలకు ఇది మరింత డ్యామేజింగ్ సబ్జెక్ట్ గా మారింది. చిన్నా పెద్దా అందరూ కోవర్టు రాజకీయాలను ఖండిస్తున్నారు. ఆరోపణలు చేసి తప్పించుకుంటే కాదని, వారెవరో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. విజయశాంతి, ఈటల.. ఇద్దరూ గతంలో బీఆర్ఎస్ నేతలే. వివిధ కారణాలతో ఇద్దరూ పార్టీలు మారారు, ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. ఇక్కడ కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కోవర్టు రాజకీయంపై విజయశాంతి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి దీనికి ఈటల సమాధానం ఇస్తారో లేదో వేచి చూడాలి.