Telugu Global
Telangana

తెలంగాణలో పాతిక కోట్ల రాజకీయం.. సవాళ్లు, ప్రతి సవాళ్లు..

బీజేపీలోకి చేరికలు లేకపోవడం వల్లే ఫ్రస్ట్రేషన్‌ లో ఈటల ఇలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందన్న భయం బీజేపీలో కనిపిస్తోందన్నారు.

తెలంగాణలో పాతిక కోట్ల రాజకీయం.. సవాళ్లు, ప్రతి సవాళ్లు..
X

మునుగోడు ఉప ఎన్నికలు అయిపోయిన ఐదు నెలల తర్వాత ఈటల రాజేందర్ చేసిన పాతిక కోట్ల ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పాతిక కోట్లతో కాంగ్రెస్ ని కొనేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు ఈటల. పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి ప్రమాణం చేయడం, తీవ్ర భావోద్వేగానికి గురికావడం తెలిసిందే. ఆ తర్వాత కూడా బీజేపీ బ్యాచ్ రేవంత్ ని వదిలిపెట్టలేదు. వీరుడు, ధీరుడు అలా ఏడవడమేంటని ఎద్దేవా చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈటల కాంగ్రెస్ ని విమర్శిస్తే, రేవంత్ రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కర్నాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ రెడ్డి సతమతం అవుతున్నారని అన్నారు.

భట్టి కౌంటర్..

ఈటల ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు తలోరకంగా స్పందించడం విశేషం. అసలు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తానిక్కడ లేనని, అందుకే తాను ఆ ఆరోపణలపై స్పందించబోనని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇక బీజేపీ ఆరోపణలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారాయన. ఆ దుర్మార్గపు అజెండాలో భాగంగానే అయిపోయిన మునుగోడు ఎన్నికలపై ఈటల మాట్లాడారని అన్నారు. ఈటల లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై, అధ్యక్షుడిపై బురదజల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమది వ్యాపారస్తుల పార్టీ కాదని, బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. తామెప్పుడూ తప్పుడు పనులు చేయలేదని, నీతి, నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నామని, వారికి ఉన్న అలవాట్లే.. కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయనే భావనతో మాట్లాడటం సరైంది కాదని బీజేపీ నేతలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

బీజేపీలోకి చేరికలు లేకపోవడం వల్లే ఫ్రస్ట్రేషన్‌ లో ఈటల ఇలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈటల ఆరోపణలు వ్యక్తిగతమా, లేక బీజేపీ పార్టీవా అనేది స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చేతిలోనే ఉన్నాయని, ఈటల చెప్పినట్టు కాంగ్రెస్‌ కు కేసీఆర్​ రూ.25 కోట్లు ఇచ్చి ఉంటే, ఆ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందన్న భయం బీజేపీలో కనిపిస్తోందన్నారు.

మొత్తమ్మీద ఉపఎన్నికలు అయిపోయిన ఐదు నెలల తర్వాత మళ్లీ మునుగోడు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఈటల ఆరోపణలపై ఇరు వర్గాల నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

First Published:  23 April 2023 7:35 PM IST
Next Story