Telugu Global
Telangana

విజయవాడకు 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు.. రేపు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మేఘా సంస్థకు చెందిన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను ఈ-గరుడ పేరుతో నడపనున్నారు. విజయవాడ రూట్లో మొత్తం 50 ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడకు 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు.. రేపు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
X

టీఎస్ఆర్టీసీ ఈ-గరుడ పేరుతో రేపటి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఈ బస్సులను ప్రారంభించనున్నారు. విజయవాడ రూట్లో ప్రతీ 20 నిమిషాలకు ఈ-గరుడ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ పేర్కొన్నది.

మేఘా సంస్థకు చెందిన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను ఈ-గరుడ పేరుతో నడపనున్నారు. విజయవాడ రూట్లో మొత్తం 50 ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఒలెక్ట్రా సంస్థకు ఈ మేరకు ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇందులో 10 బస్సులు అందుబాటులోకి రావడంతో అవి మంగళవారం నుంచి రోడ్డెక్కబోతున్నాయి. మియాపూర్ చౌరస్తాలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద రేపు సాయంత్రం ఈ బస్సులకు మంత్రి అజయ్ పచ్చజెండా ఊపనున్నారు.

కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లో అన్ని అత్యాధునిక హంగులు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. సీసీ కెమెరాలు, పూర్తి స్థాయి ఏసీ, చార్జింగ్ పాయింట్లు, డ్రైవర్ వద్ద పీఏ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి. పానిక్ బటన్ కూడా సీట్ల వద్ద ఏర్పాటు చేశారు. ప్రయాణం మధ్యలో ఏవైనా ఆటంకాలు ఏర్పడితే ప్రయాణికులు ఈ బటన్ నొక్కవచ్చు. ఇది నేరుగా టీఎస్ఆర్టీసీ హెడ్ క్వార్టర్‌లోని కంట్రోల్ సెంటర్‌కు సమాచారం ఇస్తుంది. ఇక అత్యాధునిక అగ్నిమాపక నిరోధక వ్యవస్థ కూడా బస్సులో ఉన్నది.

ఈ-గరుడు బస్సులు తమ ప్రయాణంలో సూర్యాపేట వద్ద తప్పకుండా ఆగుతాయి. ఇక్కడ ఫాస్ట్ చార్జర్ ద్వారా బస్సును చార్జ్ చేస్తారు. అలాగే మియాపూర్ డిపోలో కూడా ఈ-గరుడ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్లను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని అధికారులు చెప్పారు. ఈ-గరుడ బస్సుల చార్జీలు అందరికీ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.


First Published:  15 May 2023 11:38 AM GMT
Next Story