Telugu Global
Telangana

ఉచిత కరెంటు.. భట్టి ప్రకటనతో మరింత గందరగోళం

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డుని ప్రాతిపదికగా చేసుకుంది. అయితే రేషన్ కార్డు లేని అర్హులు కూడా చాలామంది ఉన్నారు.

ఉచిత కరెంటు.. భట్టి ప్రకటనతో మరింత గందరగోళం
X

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు అనే నిబంధనతో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గ్యారెంటీని పట్టాలెక్కించింది. అయితే ఒకే రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయనే కారణంతో వేరు పడిన కుటుంబాలకు ఈ ఉచితం అందడంలేదు. 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువ అయినా మొత్తానికి బిల్లు వేసేస్తున్నారు. ఇలాంటి ప్రాక్టికల్ కష్టాలు చాలానే ఉన్నాయి. ఈ దశలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు మరో సలహా ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్న వారికి కూడా బిల్లు వస్తే.. అది చెల్లించకుండా వారు వెంటనే జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 45వేలమందికి ఇలా రివైజ్డ్ జీరో బిల్లులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డుని ప్రాతిపదికగా చేసుకుంది. అయితే రేషన్ కార్డు లేని అర్హులు కూడా చాలామంది ఉన్నారు. వారంతా ప్రజా పాలనలో రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి మంజూరు కాక ముందే కొన్ని పథకాలను పట్టాలెక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో చాలామంది అర్హులు రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారు. కరెంటు బిల్లులు కూడా ఇలాంటి ఇబ్బందుల్నే తెచ్చిపెడుతున్నాయి. వీరికి ప్రత్యామ్నాయం చూపించడంలో ప్రభుత్వం తడబడుతోంది.

జీరో కరెంటు బిల్లుల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 200 యూనిట్ల పరిమితి విషయంలో కనికరం చూపాలని, ఆ పరిధిలోపు వాడుకున్న వారికి జీరో బిల్లులు ఇస్తూనే దాన్ని దాటిన వారికి కేవలం ఆయా యూనిట్ల వరకే బిల్లులు వసూలు చేయాలన్నారు. అదే సమయంలో ఒక రేషన్ కార్డుకి ఒకటే ఉచిత బిల్లు అనే నిబంధనను కూడా సవరించాలన్నారు. వేరుపడిన కుటుంబాలు ఒకే రేషన్ కార్డులో ఉన్నా కూడా వారందర్నీ లబ్ధిదారులుగా చూడాలని చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొంతవరకు క్లారిటీ ఇచ్చినా అది మరింత గందరగోళానికి దారితీసే అవకాశముంది. రేషన్, ఆధార్, కరెంటు కనెక్షన్ వివరాల్లో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా జీరో బిల్లు మంజూరు కాదు, టెక్నికల్ సమస్యలున్నా కూడా లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవు. మొత్తమ్మీద గృహజ్యోతి పథకం విషయంలో ప్రభుత్వం నుంచి మరింత క్లారిటీ వస్తేకానీ అసలైన లబ్ధిదారులకు మేలు జరగదు.

First Published:  10 March 2024 4:15 AM GMT
Next Story