ఆ భూములకు రైతు భరోసా లేదు..
5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామని, ప్రస్తుతానికి పాత డేటా ప్రకారమే ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
రైతు భరోసా విషయంలో కీలక ప్రకటన చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సచివాలయంలో జరిగిన సమావేశంలో రైతు భరోసా సహా పలు ఇతర పథకాల అమలుపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రైతులకు ఆర్థిక సాయం చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నట్టు చెప్పారు. ఆ నిబంధనల ప్రకారం ఇకపై కొండలు, గుట్టలకు రైతు భరోసా జమకాదు. అంటే సాగుబడిలో ఉన్న భూమినే పరిగణలోకి తీసుకుని రైతులకు ఆర్థిక సాయం చేస్తామని భట్టి స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసాను 5 నెలల వ్యవధిలో ఇచ్చిందని, యాసంగిలో 4 నెలలలోపు ఎప్పుడూ డబ్బులు జమ చేయలేదని చెప్పారు భట్టి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారికంటే తక్కువ సమయంలోనే రైతు భరోసా విడుదల చేస్తోందని చెప్పారాయన. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామని, ప్రస్తుతానికి పాత డేటా ప్రకారమే ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. కొండలు, గుట్టలు, రోడ్లకు.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా అమలు చేయదని అన్నారు భట్టి.
వాస్తవానికి రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిబంధనలు సరిచేసేందుకు సిద్ధపడింది. ఎన్నికల తర్వాత ఆ పనిచేయాలనుకుంది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచార సభల్లో కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు మార్చాలనుకోవడం విశేషం. అనర్హులు చాలామందికి రైతు భరోసా నిధులు తీసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో లబ్ధిదారుల జాబితాను సరిచేయబోతున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది. అదే సమయంలో సాగు జరుగుతున్న భూములకు మాత్రమే ఇకపై రైతు భరోసా జమ అయ్యే అవకాశముంది. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో పేర్కొంది కాబట్టి వచ్చే దఫా వారిని కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చే అవకాశముంది.