ప్రజలకు దసరా దసరాలాగా లేదు
ఢిల్లీలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రికి తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా? అని ఎక్స్‌వేదికగా కేటీఆర్ ప్రశ్న
ఢిల్లీలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రికి తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఐదు లక్షల రైతన్నలు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రైతుబంధు కోసం కళ్లు కాయలుగాసేలా ఎదురుచూస్తున్నారు. దళారుల చేతిలో పత్తి రైతులు దగాకు గురై అల్లాడుతున్నారు. రైతు వ్యతిరేక పాలనతో ప్రజలకు దసరా దసరాలాగా లేదన్నారు.
'1, కాదు, 2 కాదు, 3 కాదు, 23 సార్లు హైదరాబాద్-సికింద్రాబాద్‌కు తిరిగినట్లు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న నీకు తెలంగాణ గల్లీలో తిరిగి చూసే ఓపిక లేదా? 5 లక్షల రైతన్నలు రూ. 2 లక్షల రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. 67 లక్షల మందికి పైగా రైతన్నలు రైతు బంధు కోసం కండ్లు కాయలుగాసేలా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయశాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తి రైతులు దళారుల చేతిలో దగా అయ్యి అల్లాడుతున్నారు. నీ రైతు వ్యతిరేక పాలన పుణ్యమా అని ఈ దసరా తెలంగాణ ప్రజలకు దసరాలాగ లేకపోయే' అని ట్వీట్ చేశారు. రబీ వచ్చినా రైతు భరోసా ఏది అనే పేపర్ క్లిప్‌ను ట్వీట్‌తో జత చేశారు.
తెలంగాణ ప్రజల గళం రాహుల్‌కు వినిపిస్తుందా?
బుల్డోజర్ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు గళం విప్పుతున్నారని ఇది రాహుల్‌గాంధీకి వినిపిస్తుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. యువత, చిన్నారి పిలిచినా వస్తానని తుక్కుగూడలో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు. ఇచ్చిన మాటపై నిలబడి మూసీ నిర్వాసితులను కలువాలని కేటీఆర్ సూచించారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద ఏటా రూ. 10 వేలే ఇస్తున్నది. ఇప్పుడు తీసుకుంటే పది వేలే వస్తాయి. అదే డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే రైతు భరోసా కింద రూ. 15 వేలు వస్తాయని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు మీడియా ముందు చెప్పిన మాటలు. అంతేకాదు కౌలు రైతులకు రూ. 12 వేలు ఇస్తామన్నారు. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి అది సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచాయి. కానీ రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. యాసంగి ముగిసింది. ప్రస్తుత వానకాలం సీజన్ కూడా పూర్తయ్యింది. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఇవ్వకుండా, కాంగ్రెస్ ఇచ్చిన రైతు భరోసా ఇవ్వకుండా తమను మోసం చేసిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.