స్కూళ్లకు 13 నుంచి, కాలేజీలకు 19నుంచి దసరా సెలవులు
దసరా సెలవులు 14 నుంచి ఇస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. అయితే పాఠశాలల్లో పిల్లలకు బుధవారంతో పరీక్షలు ముగిశాయి. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు గురువారం నుంచే సెలవులు ప్రకటించాయి.
తెలంగాణలో విద్యార్థులకు పండగ సందడి ముందే వచ్చేసింది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ ఎసెస్‌మెంట్ (ఎస్ఏ1) పరీక్షలు ముగియడంతో రేపటి నుంచే సెలవులిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దసరా పండగ, బతకమ్మ ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందే పిల్లలకు ఆటవిడుపు దొరికింది.
14 నుంచి అని తొలుత ప్రకటన
దసరా సెలవులు 14 నుంచి ఇస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. అయితే పాఠశాలల్లో పిల్లలకు బుధవారంతో పరీక్షలు ముగిశాయి. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు గురువారం నుంచే సెలవులు ప్రకటించాయి. మరికొన్నింటికి ఈ రోజుతో పరీక్షలు ముగుస్తున్నాయి. దీంతో అన్ని పాఠశాలలకు శుక్రవారం నుంచే సెలవులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మూడు రోజుల ముందే వచ్చాయి
వాస్తవానికి అక్టోబర్ 15 ఆదివారం నుంచే నవరాత్రులు ప్రారంభం. అయితే అంతకు ముందు 14 రెండో శనివారం ఉండటంతో ఆ రోజు నుంచి సెలవు ఇచ్చారు. ఇప్పుడు మరో రోజు ముందుకు జరిపారు. మొత్తంగా 3 రోజులు ముందే సెలవులొచ్చాయి. అక్టోబర్ 26న బడులు తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే మొత్తం 13 రోజుల సెలవులు. కాగా జూనియర్ కాలేజీలకు 19 నుంచి సెలవులు ఇచ్చారు.