కాంగ్రెస్ హయాంలో కాలిన మీటర్లు, ఎండిన పొలాలు ఉండేవి : మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ నాయకులు తాము ఎంతో చేసినట్లు గొప్పలు మాట్లాడుకుంటున్నారు. కానీ తెలంగాణ వచ్చి, కేసీఆర్ సీఎం అయిన తర్వాతే గ్రామాలు అభివృద్ధి చెందాయని హరీశ్ రావు చెప్పారు
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాలిపోయిన మీటర్లు, ఎండిపోయిన పొలాలు కనపడేవి. ఇప్పుడు రైతులకు సీఎం కేసీఆర్ కరెంటు బిల్లులు కడుతుండటం.. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొని.. గిట్టు బాటు ధర చెల్లిస్తున్నామని మంత్రి చెప్పారు. సిద్దిపేట జిల్లా తిమ్మాయిపల్లి, భాషాయిగూడెం గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పక్క రాష్ట్రంలో వరి ధాన్యం కొనడం లేదని.. అక్కడి రైతులు కూడా తెలంగాణకు వచ్చి పంటను అమ్ముకుంటున్నారని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అర్థరాత్రి కరెంటు వచ్చేది. అప్పట్లో కరెంటు సరైన నాణ్యత లేక మోటార్లు కూడా కాలిపోయేవని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు తాము ఎంతో చేసినట్లు గొప్పలు మాట్లాడుకుంటున్నారు. కానీ తెలంగాణ వచ్చి, కేసీఆర్ సీఎం అయిన తర్వాతే ఇక్కడి గ్రామాలు అభివృద్ధి చెందాయని హరీశ్ రావు చెప్పారు. తిమ్మాయిపల్లికి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. అదొక్క ఉదాహరణ చాలదా అని అన్నారు.
తెలంగాణ రాక ముందు పల్లెలు ఎలా ఉండేవో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పారు. గ్రామాల్లోని ప్రతీ గల్లీలో సీసీ రోడ్ల నిర్మాణం చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఇక్కడ ఆకుపచ్చ గ్రామాలు అయ్యాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట నష్టం జరిగింది. ఇకపై వానాకాలం పంటలు ఒక నెల ముందు పెట్టుకోవాలని మంత్రి సూచించారు. అలాగే రైతులు ఆయిల్ పామ్ పంటలు వేసుకోవాలని చెప్పారు. నేను ఆయిల్ పామ్ పెట్టిన.. మంచి లాభాలు వస్తున్నాయి. మీరు కూడా ఆ పంటను పండించి చూడమని హరీశ్ రావు సూచించారు.
ఎప్పుడూ ఒకటే పంట వేయకుండా పంట మార్పిడి చేస్తుండాలని హరీశ్ రావు చెప్పారు. అలా చేయడం వల్ల పంటలు రోగాల బారిన పడకుండా ఉంటాయన్నారు. సాధ్యమైనంత వరకు పంటలకు రసాయనాలు చల్లడం తగ్గించాలని చెప్పారు. రైతులు పంట దిగుబడి కోసం జీలుగు, జనుము వాడాలని చెప్పారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని.. అలా చేయడం వల్ల భూసారం తగ్గుతుందని హరీశ్ రావు చెప్పారు.
ఇంటర్ స్టేట్ ర్యాంకర్‌కు ల్యాప్‌టాప్ గిఫ్ట్..
ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన గుంటేపల్లి అశ్వితకు మంత్రి హరీశ్ రావు ల్యాప్‌టాప్ గిఫ్టుగా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదివిన అశ్విత.. 986 మార్కులతో స్టేట్ 8వ ర్యాంక్ సాధించింది. పేదింటికి చెందిన అశ్వితకు ఉన్నత చదవులు చదవాలనే కోరిక ఉన్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో ఆమె చదవుకు తాను సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. అంతే కాకుండా రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించినందుకు ల్యాప్‌టాప్ బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు శనివారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అశ్వితకు కొత్త ల్యాప్‌టాప్ అందించారు. ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని ఆశీర్వదించారు.