అధికారుల నిర్లక్ష్యం.. అనామకుల చేతుల్లోకి దరఖాస్తులు.!
ఆధార్, ఫోన్ నంబర్ లాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ దరఖాస్తుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించిన అప్లికేషన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. GHMC పరిధిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా దరఖాస్తులు అనామకుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈ నెల 17లోగా డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో అధికారులు.. అప్లికేషన్లను ఫలహారంలా పంచిపెడుతున్నారు. డేటా ఎంట్రీ కోసం ప్రభుత్వ ఆఫీసుల్లోనే సౌకర్యాలు కల్పించినప్పటికీ.. వాటిని కొందరు ఇంటికి తీసుకెళ్తుండడం అనుమానాలకు దారి తీస్తోంది.
కూకట్‌పల్లి Y-జంక్షన్‌లో రోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు కనిపించిన ఘటన మరువకముందే.. కుత్బుల్లాపూర్‌లోనూ ఇటువంటి సీన్ మరొకటి కనిపించింది. పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు దరఖాస్తులను బైక్స్‌పై ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇదే విషయమై అధికారులను వివరణ కోరితే.. సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎవరికి పడితే వారికి దరఖాస్తులు ఇస్తే గోప్యత ఏం ఉంటుందని.. దరఖాస్తులు మిస్ అయితే అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు పలువురు.
ఆధార్, ఫోన్ నంబర్ లాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ దరఖాస్తుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికైనా డేటా ఎంట్రీ ప్రక్రియను ఏదైనా ఏజెన్సీకి అప్పగించి పకడ్బందీగా చేయిస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి ఘటనలపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం కొనసాగింది. ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారంటీల కోసం దాదాపు కోటి 5 లక్షల దరఖాస్తులు రాగా.. రేషన్‌కార్డులు ఇతర దరఖాస్తుల కోసం మరో 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి.