తగ్గుతూ.. పెరుగుతూ.. గోదావరి దోబూచులాటతో ప్రజల్లో భయం..
భద్రాచలం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరిగి ప్రస్తుతం 53 అడుగులకు చేరుకుంది. నెల రోజుల్లో మూడోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే ప్రథమం.
గత నెలలో గోదావరికి వచ్చిన వరదలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెలలో రెండోసారి వరదనీరు గోదావరికి పోటెత్తడంతో ప్రజలు హడలిపోతున్నారు. అయితే నీటిమట్టం తగ్గుతూ, పెరుగుతూ రెండు వారాలుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పొలాల్లో వరదనీరు తిష్టవేసింది, ఇళ్లలోకి వస్తుందో రాదో తెలియని కంగారులో ప్రజలు అనుక్షణం భయం భయంగానే ఉంటున్నారు. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరిగింది. 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. తగ్గినట్లే తగ్గి మళ్ళీ వరద పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద కారణంగా భద్రాచలం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరిగి ప్రస్తుతం 53 అడుగులకు చేరుకుంది. నెల రోజుల్లో మూడోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదనీరు రోడ్లపైకి వచ్చి చేరింది. భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం వెళ్లే రహదారి, భద్రాచలం నుంచి ఏపీకి వచ్చే ప్రధాన రహదారిపై కూడా వరదనీరు తిష్టవేసింది.
గోదావరి వరదతో భద్రాచలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్, ఎస్పీ. ఇతర అధికారులతో కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నీటిమట్టం తగ్గకపోగా 55 అడుగులకు చేరుకోవచ్చని ఇప్పటికే కేంద్ర జలసంఘం రిపోర్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. అదే జరిగితే మరోసారి గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రజలు వరదలతో తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. ఇటు ఏపీలో కూడా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లంక గ్రామాల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరిగే అవకాశముండటంతో నేతలు, అధికారులు హడావిడి పడుతున్నారు.