Telugu Global
Telangana

తెలంగాణకు క్యూ కడుతున్న దుబాయ్ కంపెనీలు.. భారీ పెట్టుబడులు.. కొత్త ఉద్యోగాలు

దుబాయ్‌కి చెందిన నాఫ్కో రూ.700 కోట్ల పెట్టుబడి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు డీపీ వరల్డ్, మలబార్ కంపెనీలు కూడా పెట్టుబడులు ప్రకటించాయి. ఇక లూలూ సంస్థ సిరిసిల్ల ఆక్వా క్లస్టర్‌లో పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది.

తెలంగాణకు క్యూ కడుతున్న దుబాయ్ కంపెనీలు.. భారీ పెట్టుబడులు.. కొత్త ఉద్యోగాలు
X

తెలంగాణకు దుబాయ్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సై అంటున్నాయి. అమెరికా పర్యటన తర్వత దుబాయ్‌లో అడుగు పెట్టిన మంత్రి కేటీఆర్ ఈ మేరకు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. మంగళవారం ఒక్క రోజే రూ.1,040 కోట్ల మేర పెట్టుబడులను సాధించారు. దుబాయ్‌కి చెందిన నాఫ్కో రూ.700 కోట్ల పెట్టుబడి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు డీపీ వరల్డ్, మలబార్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించాయి. ఇక లూలూ సంస్థ సిరిసిల్ల ఆక్వా క్లస్టర్‌లో పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది.

డీపీ వరల్డ్ విస్తరణ..

లాజిస్టిక్స్ రంగంలో ప్రపంచ దిగ్గజ కంపెనీగా పేరున్న డీపీ వరల్డ్ తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడితో కార్యాకలాపాలు విస్తరించడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల పోర్ట్ ఆపరేటర్‌గా ఉన్న డీపీ వరల్డ్ ఇప్పుడు రాష్ట్రంలో ఒక కంటెయినర్ డిపో, కోల్డ్ స్టోరేజ్ వేర్‌హౌసింగ్‌ను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్‌లో ఇన్‌లాండ్ కంటెయినర్ డిపో కోసం రూ.165 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. మేడ్చెల్ ప్రాంతంలో రూ.50 కోట్లతో 5వేల ప్యాలెట్ సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్ ఏర్పాటు చేయనున్నది.

డీపీ వరల్డ్ గ్రూప్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ మెహతా, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ సాలుష్ శాస్త్రితో మంత్రి కేటీఆర్ దుబాయ్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గత 9 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక వ్యాపార అనుకూల పాలసీలను కేటీఆర్ వివరించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన అద్భుతమైన ప్రగతిని వివరించారు.

మలబార్ ఫర్నీచర్ తయారీ ప్లాంట్..

తెలంగాణలో ఇప్పటికే మలబార్ గ్రూప్ పలు పెట్టుబడులు పెట్టింది. బంగారం రిఫైనరీ రంగంలో పెట్టుబడి పెట్టిన ఈ సంస్థ.. తాజాగా ఫర్నిచర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. రూ.125 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండగా.. 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని సంస్థ వెల్లడించింది. మలబార్ గ్రూప్ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. దుబాయ్‌లో అందుబాటులో లేని సంస్థ చైర్మన్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు.

తెలంగాణలో ఇప్పటికే తమకు గోల్డ్ రిఫైనరీ, ప్రాసెసింగ్ పరిశ్రమ నిర్మాణ కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయిన అహ్మద్ వివరించారు. ప్రభుత్వ సహకారం చాలా చక్కగా ఉందని కొనియాడారు. తెలంగాణలో తమ పెట్టుబడులను, కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నందుకు మలబార్ గ్రూప్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

సిరిసిల్లకు లులూ గ్రూప్..

యూఏఈకి చెందిన ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ సంస్థ లులూ గ్రూప్ తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ నేతృత్వంలోని బృందం సమావేశం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ , ఫుడ్ ప్రాసెసింగ్, రీటైల్ రంగంలో తమ కంపెనీ నిర్వహిస్తున్న కార్యకలాపాలను మంత్రికి వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న షాపింగ్ మాల్ వివరాలను కూడా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంపై యూసుఫ్ అలీ సంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా, సిరిసిల్లలో ప్రతిపాదిత ఆక్వా క్లస్టర్‌లో పెట్టుబడి పెట్టనున్నామని, ఆ ప్రాంతం నుంచి ఏటా రూ.1000 కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులను సేకరిస్తామని లులూ గ్రూప్ ప్రకటించింది. కోల్డ్ స్టోరేజ్, చేపల ప్రాసెసింగ్ యూనిట్‌లో పెట్టుబడులు పెడతామని చెప్పింది. దీని ద్వారా దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుందని యూసుఫ్ అలీ వివరించారు.




First Published:  6 Sept 2023 5:48 AM IST
Next Story