ప్రభుత్వం పట్టుదలకు పోతోందా..? డీఎస్సీపై ఎందుకీ గొడవ..?
పోస్ట్ ల సంఖ్య పెంచకపోయినా, ప్రస్తుతానికి డీఎస్సీ వాయిదా పడితే.. అభ్యర్థులు శాంతించే అవకాశముంది.
తెలంగాణలో నిన్న మొన్నటి వరకు గ్రూప్స్ పరీక్షల విషయంలో నిరసనలు జరిగాయి. పోస్ట్ ల సంఖ్య పెంచాలని, మెయిన్స్ పరీక్ష కోసం 1:100 నిష్పత్తిలో ఎంపికలు జరగాలని విద్యార్థి నేతలు ఆమరణ దీక్షలకు కూడా దిగారు. ఆ గొడవ సద్దుమణిగింది అనుకుంటున్న టైమ్ లో తాజాగా డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలంటూ నిరసన చేపట్టారు. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేయడంతో ఈ గొడవ పెరిగి పెద్దదైంది. లాఠీ చార్జ్ లు, అక్రమ నిర్బంధాలతో ఇది మరింత హైలైట్ అయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా కదలడంతో ఈ వ్యవహారం హాట్ హాట్ గా మారింది.
డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్లు ఏంటి..?
డీఎస్సీ పరీక్షలు 3 నెలలు వాయిదా వేయాలి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలనేవి అభ్యర్థుల ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్లు నెరవేర్చుకోడానికి వారు పోరుబాట పట్టారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయాలన్ని వారు ముట్టడించారు. విడతలవారీగా అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ తన అనుచరులతో కలిసి డీఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా ఈ నిరసనల్లో పాల్గొనడం విశేషం. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు నిరసనకారులకు మద్దతు తెలిపారు.
ఎందుకీ మొండి పట్టుదల..?
నోటిఫికేషన్ ఇచ్చి పోస్ట్ లు భర్తీ చేస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులకు శత్రువుగానే కనపడుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇప్పుడు నిరసనలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఆలస్యం చేసేకొద్దీ ఆందోళనలు ఉధృతం అవుతాయి. పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు, అయితే ఆందోళనలకు తలొగ్గడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పోస్ట్ ల సంఖ్య పెంచకపోయినా, ప్రస్తుతానికి డీఎస్సీ వాయిదా పడితే.. అభ్యర్థులు శాంతించే అవకాశముంది.