Telugu Global
Telangana

డీఎస్సీ వాయిదాకోసం హాల్ టికెట్ల దహనం

పరీక్షలు వాయిదా పడతాయని ఆశపడిన చాలామంది అభ్యర్థులు సన్నద్ధతలో వెనకపడి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

డీఎస్సీ వాయిదాకోసం హాల్ టికెట్ల దహనం
X

తెలంగాణలో డీఎస్సీ వాయిదాకోసం అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిరసనలు, ఆందోళనలతో ఫలితం లేకపోయే సరికి సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. చాలామంది అభ్యర్థులు సెల్ఫీ వీడియోలతో తమ బాధలు బయటపెడుతున్నారు. చివరి ప్రయత్నంగా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటూ కొంతమంది హాల్ టికెట్లు దహనం చేస్తున్నారు. వాటిని తగలబెడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలను బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ట్విట్టర్లో షేర్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు.


లాజిక్ లేని ప్రభుత్వం..

ప్రభుత్వం తమ పంతం నెగ్గించుకోడానికి డీఎస్సీ అభ్యర్థుల జీవితాలను బుగ్గి పాలు చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. జూన్ 2 వరకు టెట్ పరీక్షలు పెట్టారని, వాటిలో అర్హత సాధించిన వారు జులై 18 న ప్రారంభమయ్యే డీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవుతారని ఆయన నిలదీశారు. కనీస జ్ఞానం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

డీఎస్సీ వాయిదాతోపాటు పోస్ట్ ల పెంపు, గ్రూప్స్ పరీక్షల పోస్ట్ ల పెంపు, గ్రూప్ 1 మెయిన్స్ కి 1ః100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక వంటి డిమాండ్లతో తెలంగాణలో కొన్నిరోజులుగా విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం మాత్రం కనికరించడంలేదు. ఈ నిరసనలు కేవలం ప్రతిపక్షాల ప్రేరేపితం అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా విద్యార్థుల దీక్షల వెనక కోచింగ్ సెంటర్లు ఉన్నాయని తేల్చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. పరీక్షలు వాయిదా పడతాయని ఆశపడిన చాలామంది అభ్యర్థులు సన్నద్ధతలో వెనకపడి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

First Published:  16 July 2024 9:40 AM GMT
Next Story