తెలంగాణలో టీబీ రోగులకు డ్రోన్ సేవలు
భువనగిరి, రామన్నపేట, బీబీనగర్, బొమ్మల రామారం మండలాల పరిధిలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు డ్రోన్‌లను అనుసంధానం చేశారు. ఆయా ప్రాంతాలనుంచి రోగుల నమునాలు సేకరించి రిమోట్ ద్వారా జిల్లా కేంద్రంలోని క్షయవ్యాధి యూనిట్‌లకు పంపించారు.
తెలంగాణలో బీబీ నగర్ ఎయిమ్స్ పరిధిలో డ్రోన్ సేవలు విజయవంతం అయ్యాయి. ముఖ్యంగా టీబీ రోగులనుంచి గళ్ల నమూనాలు సేకరించడం, వారికి తిరిగి మందులు చేరవేయడం ఈ డ్రోన్ ల ద్వారా నిర్వహించారు. 2 నెలలపాటు పైలట్ ప్రాజెక్ట్ గా డ్రోన్ సేవలను పరిశీలించామని, అవి విజయవంతం అయ్యాయని తెలిపారు బీబీ నగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా.
డ్రోన్ తో ఎలా..?
ఇప్పటికే వైద్య రంగంలో డ్రోన్ సేవలు విస్తృతం అవుతున్నాయి. అత్యవసర సమయాల్లో డ్రోన్ ద్వారా దూర ప్రాంతాలవారికి మందుల సరఫరా విజయవంతం అయింది. టీబీ లాంటి వ్యాధులు ఉన్నవారి విషయంలో కూడా డ్రోన్ ల వాడకం మెరుగైన ఫలితాలనిస్తోంది. టీబీ వ్యాధిగ్రస్తులనుంచి నమూనాలు సేకరించడం, వాటిని ల్యాబ్ లకు పంపించడంతోపాటు.. టీబీ నిర్థారణ అయిన తర్వాత వారికి అవసరమైన మందుల్ని డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు వైద్యులు. బీబీ నగర్ ఎయిమ్స్ పరిధిలోని గ్రామాలు, తండాలనుంచి 150మంది నమూనాలను ఇలా సేకరించి ల్యాబ్ లకు పంపించారు. టీబీ నిర్థారణ అయినవారికి మందులను కూడా డ్రోన్ ల ద్వారానే చేరవేశారు.
భువనగిరి, రామన్నపేట, బీబీనగర్, బొమ్మల రామారం మండలాల పరిధిలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు డ్రోన్‌లను అనుసంధానం చేశారు. ఆయా ప్రాంతాలనుంచి రోగుల నమునాలు సేకరించి రిమోట్ ద్వారా జిల్లా కేంద్రంలోని క్షయవ్యాధి యూనిట్‌లకు పంపించారు. తిరిగి అక్కడి నుంచి రోగులకు అవసరమయ్యే టీబీ మందులు, ట్యూబ్‌లు, రియేజెంట్‌లను డ్రోన్‌లో ఉంచి రోగులకు పంపించారు. దీని కోసం ప్రస్తుతం ఎయిమ్స్ లో 2 డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. శిక్షణ తీసుకున్న ముగ్గురు డ్రోన్ పైలెట్లు షిఫ్ట్ ల వారీగా వీటిని ఆపరేట్ చేస్తున్నారు. డ్రోన్ సేవల ద్వారా టీబీ నిర్థారణలో సమయం బాగా తగ్గిందని అంటున్నారు వైద్య అధికారులు. దూర ప్రాంతాల వాసులకు, రవాణా సౌకర్యం సరిగా లేనివారికి డ్రోన్ సేవలు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.