Telugu Global
Telangana

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారని, బకాయిలను కూడా వారికి త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని చెప్పారు సజ్జనార్.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
X

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభ వార్త. సెప్టెంబర్ జీతంతో పాటు వారికి కరువు భత్యం (డీఏ) కూడా కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. పెండింగ్ లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారాయన.

సంస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇప్పటి వరకు 8 డీఏలను మంజూరు చేశామని తెలిపారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఎనిమిదో డీఏ బకాయిగా ఉందని, దాన్ని ఇప్పుడు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ జీతంతో కలిసి ఆ డీఏ మొత్తం చెల్లించబోతున్నారు. అంటే అక్టోబర్-1న ఆర్టీసీ ఉద్యోగులు తీసుకునే జీతంతో ఈ డీఏ కూడా వారికి అందుతుంది. ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారని, బకాయిలను కూడా వారికి త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని చెప్పారు సజ్జనార్.

మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. అయితే ఈ బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండటం విశేషం. అసెంబ్లీ ఆమోదించిన ఆర్టీసీ బిల్లుని న్యాయశాఖ పరిశీలనకు పంపించారు గవర్నర్. బిల్లు చట్టంగా మారే క్రమంలో గవర్నర్ తమిళిసై ఆలస్యాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే ఇప్పుడు సంస్థ ప్రకటించిన డీఏ బకాయిల విడుదల ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.

First Published:  2 Sept 2023 12:37 PM GMT
Next Story