డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో తెలంగాణలో పాలన కొనసాగుతుంది : సీఎం కేసీఆర్
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ముందు చూపుతో పెట్టిన ఆర్టికల్ 3 కారణంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని సీఎం కేసీఆర్ మరో సారి గుర్తు చేశారు.
బోధించు, సమీకరించు, పోరాడు అని సందేశం ఇచ్చిన మహనీయుడు బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కేసీఆర్ చెప్పారు. ఆ మహనీయుడు సమాన హక్కుల కోసం ఉద్యమించాలని అందరికీ చెప్పారని.. ఆ సందేశాన్ని స్పూర్తిగా తీసుకొని గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామని సీఎం కేసీఆర్ మరో సారి చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన స్పూర్తితోనే తెలంగాణలో పాలన కొనసాగిస్తామని కేసీఆర్ మరో సారి చెప్పారు. ఆయన చూపిన మార్గంలోనే మన రాష్ట్ర ప్రయాణం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
తెలంగాణ నూతన సచివాలయాన్ని ఈ రోజు మధ్యహ్నం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం సెక్రటేరియట్ ఆవరణలో మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ముందు చూపుతో పెట్టిన ఆర్టికల్ 3 కారణంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని మరో సారి గుర్తు చేశారు. అందుకే ఆయనకు నివాళిగా, ప్రజలకు ఎప్పటికీ గుర్తుండి పోయేలా 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని కేసీఆర్ చెప్పారు. ప్రతీ రోజు ఆయన విగ్రహాన్ని చూసిన వారికి.. అంబేద్కర్ ఇచ్చిన స్పూర్తి గుర్తుకు రావాలని అన్నారు. అదే కారణంతో కొత్త సచివాలయానికి కూడా ఆ మహనీయుడు పేరే పెట్టుకున్నామని చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక చర్చలు మనం చూశాం. పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగేసే సమయంలో తెలంగాణ భావాన్ని, నిర్మాణాన్ని కాంక్షను జీర్ణించుకోలేని కొందరు పిచ్చివారు కారుకూతలు కూశారు. మొత్తం తెలంగాణనే కూలగొట్టి కడుతారా? అని మరగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. అవేమీ పట్టించుకోకుండా ఇవాళ పునర్నిర్మాణం చేసుకున్నామని సీఎం కేసీఆర్ గర్వంగా చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో వనరులకు ఎలాంటి కొదువ లేదని.. గోదావరితో పాటు అనేక నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ఇంజనీర్లు ఎంతో కష్టపడి ఎన్నో అద్భుతమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారు. ఇదే తెలంగాణ పునర్నిర్మాణమని కేసీఆర్ వెల్లడించారు.
ఈ కొత్త సచివాలయాన్ని ప్రారంభించడం తన అదృష్టమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే ఇందుకోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో రాష్ట్రాలకు చెందిన కూలీలు.. తమ చెమట చుక్కలను ఈ అద్బుత నిర్మాణాల కోసం ధారబోశారని చెప్పారు. ఇక ఇందులో కొలువు తీరనున్న మంత్రులు, అధికారులు, ఇతర సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు.
Inauguration of Dr. B.R. Ambedkar Telangana State Secretariat. Watch live as CM Sri KCR addresses the State. #PrideOfTelangana #TriumphantTelangana https://t.co/xVrEqBVec2
— Telangana CMO (@TelanganaCMO) April 30, 2023
ఇదీ తెలంగాణ పునర్నిర్మాణం అంటే...#PrideOfTelangana pic.twitter.com/wLtqTOVxio
— BRS Party (@BRSparty) April 30, 2023