హైదరాబాద్ రోడ్లపైకి మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి
Double Decker Buses in Hyderabad: మంగళవారం హైదరాబాద్ లో చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ శాంతికుమారి మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
ఒకప్పుడు హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియంతో పాటు డబుల్ డెక్కర్ బస్సులు గుర్తుకొచ్చేవి. నిజాంకాలంలో ప్రారంభమైన ఈ డబుల్ డెక్కర్ బస్సులు 2003 వరకు నడిచాయి.
ఇప్పుడు హైదరాబాద్ లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 20 బస్సులను నగర రోడ్లమీద నడపాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ రోజు 3 బస్సులను ప్రారంభించింది.
ఇవి ఎలక్ట్రిక్ బస్సులు.ఈ బస్సులు డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఇవి ఒకే ఛార్జ్‌లో 150 కి.మీలు ప్రయాణిస్తాయి. 2 గంటల నుండి 2.5 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ అవుతాయి.
మంగళవారం హైదరాబాద్ లో చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ శాంతికుమారి మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఫార్ములా ఇ-ప్రిక్స్ నేపథ్యంలో, ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ లను కవర్ చేస్తూ రేస్ ట్రాక్ చుట్టూ తిరుగుతాయి. ఫిబ్రవరి 11 తర్వాత, నగరలో పర్యాటకాన్ని పెంపొందించడానికి బస్సులను హెరిటేజ్ సర్క్యూట్‌లో ఉపయోగించాలని యోచిస్తున్నారు.
కొంత కాలం క్రితం ట్విట్టర్‌లో ఒకనెటిజన్ అభ్యర్థనకు స్పందించి, మంత్రి కేటీఆర్, తాను డబుల్ డెక్కర్ లో ప్రయాణించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకొచ్చే అవకాశాలను అన్వేషించాలని అప్పుడే అధికారులను ఆదేశించారు.
ఆయన సూచనల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. అందులో మూడు బస్సులు ఈ రోజు ప్రారంభించారు. మిగిలిన మూడు బస్సులు కూడా త్వరలో వస్తాయి. హైదరాబాద్ లో మొత్తం 20 బస్సులను నడపాలని HMDA ప్లాన్ చేస్తోంది. ఒక్కో బస్సు ధర రూ.2.16 కోట్లు. ఈ బస్సుకు ఏడేళ్ళ పాటు ఆన్యువల్ మేంటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది.