డబుల్ బెడ్ రూమ్ రెండో విడత.. ఎప్పట్నుంచంటే..?
తొలి విడతలో హైదరాబాద్ లో 11,700 ఇళ్లను పంపిణీ చేయగా, రెండో విడత 13,300 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ఈనెల 2వతేదీ హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ తొలిదశ మొదలైంది. ఆరోజు 11,700మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మొత్తం 24నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు మేలు చేకూర్చారు. రెండో విడత గురించి అప్పుడే హింటిచ్చారు మంత్రి తలసాని. ఈరోజు ఆ మహూర్తం కూడా ఖరారైంది. ఈనెల 21న హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ రెండో విడత మొదలవుతుంది. ఈమేరకు మంత్రి కేటీఆర్ ఈరోజు జరిగిన సమీక్ష అనంతరం ప్రకటించారు.
రెండో విడత 13,300
తొలి విడతలో హైదరాబాద్ లో 11,700 ఇళ్లను పంపిణీ చేయగా, రెండో విడత 13,300 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం ఉండదని అన్నారు మంత్రి కేటీఆర్.
గృహలక్ష్మిపై గుడ్ న్యూస్..
హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ కూడా తెలిపారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలో గృహలక్ష్మి పథకం కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి జిల్లాలకు భిన్నంగా హైదరాబాద్ నగర పరిధి వరకు కొన్ని మార్పులు చేయాలని ఇటీవల మంత్రులు సీఎం కేసీఆర్ ని కోరగా, ఆయన అందుకు అంగీకరించారు. హైదరాబాద్ నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి స్థాయి మార్గదర్శకాలు వస్తాయని, 58, 59 జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పట్టాల రెగ్యులరైజేషన్, నోటరీ ఆస్తుల అంశం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గంలో గరిష్టంగా 20వేల మందికి లబ్ధి కలిగిందన్నారు మంత్రి కేటీఆర్.