డోర్నకల్ వాసుల వింత కోరిక.. అలా చేస్తేనే ఓట్లు వేస్తామని అభ్యర్థులకు కండిషన్
డోర్నకల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మరోసారి బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరపున రామ్ చంద్రు నాయక్, బీజేపీ తరపున భూక్యా సంగీత పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిలో తమ సమస్య పరిష్కరించేవారికే ఓటు వేస్తామంటున్నారు తాళ్లసంకీస గ్రామస్తులు.
తెలంగాణ ఎన్నికల వేళ గ్రామస్తులు రకరకాల తీర్మానాలతో హోరెత్తిస్తున్నారు. కొంతమంది ఏకపక్షంగా తమ ఓటు బీఆర్ఎస్ కేనంటూ తీర్మానాలు చేస్తున్నారు, మరికొందరు తమ ఊరి ఓట్లన్నీ ఫలానా అభ్యర్థికేనంటూ వారికి మాటిస్తున్నారు. ఈ క్రమంలో డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ నిర్ణయాన్ని ఓ ఫ్లెక్సీ రూపంలో ముద్రించి గ్రామంలో అంటించారు. ఆ ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డోర్నకల్ నియోజకవర్గంలో తాళ్లసంకీస గ్రామస్తులు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. గ్రామంలో కూడా గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. వాటి బాధ భరించలేక చాలాసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదనేది వారి ఆరోపణ. దీంతో వారు వినూత్న తరహాలో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికల టైమ్ చూసుకుని అభ్యర్థులకు కండిషన్ పెట్టారు. కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే అభ్యర్థికే తమ గ్రామస్తులు ఓటు వేస్తారని తీర్మానించారు. ఆ మేరకు తాళ్ల సంకీస గ్రామంలో ఫ్లెక్సీని సైతం ఏర్పాటు చేశారు.
డోర్నకల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మరోసారి బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరపున రామ్ చంద్రు నాయక్, బీజేపీ తరపున భూక్యా సంగీత పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిలో కోతుల బాధ తీర్చేవారెవరో చెబితే వారికే ఓటు వేస్తామంటున్నారు తాళ్లసంకీస గ్రామస్తులు. ఆ మేరకు తమకు హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.