రైతుబంధు,పెన్షన్లపై ఆందోళన వద్దు.. సీఎం రేవంత్ క్లారిటీ!
దరఖాస్తుల స్వీకరణ, ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.

రైతుబంధు,పెన్షన్లపై లబ్ధిదారుల్లో ఉన్న సందేహాలపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే రైతుబంధు, పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులందరికీ యథావిధిగా పథకాలు అందుతాయని స్ఫష్టంచేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. గతంలో రైతుబంధు,పెన్షన్లు అందనివారు, కొత్తగా ఈ పథకాలు తమకు రావాలని కోరుకుంటున్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి గందరగోళం అవసరం లేదన్నారు.
ప్రజాపాలన కార్యక్రమంపై చీఫ్ సెక్రటరీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. దరఖాస్తుల స్వీకరణ, ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ఇక ప్రజాపాలన దరఖాస్తులు అమ్ముకుంటున్నారని వస్తున్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తులకు కొరత లేకుండా అవసరమైనన్ని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు అవసరమైన తాగునీరు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని మరోసారి స్పష్టంచేశారు.