Telugu Global
Telangana

కుక్కలు మిమ్మల్ని ఎప్పుడూ కరవలేదా? జీహెచ్ఎంసీ అధికారులకు హైకోర్టు ప్రశ్న!

వీధి కుక్కల కోసం షెల్టర్ హౌస్‌లు ఏర్పాటు చేశామని.. ఇప్పటికే కుక్కలకు రెగ్యులర్‌గా స్టెరిలైజేషన్ చేస్తున్నామని జీహెచ్ఎంసీ తరపు లాయర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

కుక్కలు మిమ్మల్ని ఎప్పుడూ కరవలేదా? జీహెచ్ఎంసీ అధికారులకు హైకోర్టు ప్రశ్న!
X

జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల దాడులు పెరగడంపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. ఇలాంటి సంఘటనలు నివారించడంలో జీహెచ్ఎంసీ ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించింది. నగరంలోని వీధుల వెంట కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉండటం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని ఎందుకు షెల్టర్‌లకు తరలించడం లేదని హైకోర్టు జీహెచ్ఎంసీని ప్రశ్నించింది. గత నెల అంబర్‌పేటలో నాలుగేళ్ల చిన్నారిని వీధికుక్కలు కరిచి చంపివేసిన ఘటనపై సుమోటో కేసును నమోదు చేసిన హైకోర్టు.. గురువారం విచారణ చేపట్టింది.

హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్. తుకారాంజీల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ తరపు లాయర్ కటిక రవీందర్ రెడ్డిని కోర్టు పలు ప్రశ్నలు అడిగింది. జీహెచ్ఎంసీ సిబ్బందిని కుక్కలు ఏనాడూ కరువలేదా అని ప్రశ్నించింది. వీధి కుక్కలను వెంటనే ఇతర ప్రదేశాలకు తరలించాలని.. ఇప్పటి వరకు ఆ దిశగా తీసుకున్న చర్యలేమిటని అడిగింది. కాగా, వీధి కుక్కల కోసం షెల్టర్ హౌస్‌లు ఏర్పాటు చేశామని.. ఇప్పటికే కుక్కలకు రెగ్యులర్‌గా స్టెరిలైజేషన్ చేస్తున్నామని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశారు.

అంబర్‌పేటలో చనిపోయిన చిన్నారి కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం చెల్లించామని హైకోర్టుకు చెప్పారు. ఇది ఆ కుటుంబానికి కాస్త ఊరట మాత్రమే.. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్ అవడానికి అవకాశం ఇవ్వాలని లాయర్ మామిడి వేణుమాధవ్ కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1996 నుంచి యానిమల్ బర్త్ కంట్రోల్ అమలు చేస్తున్నారని.. అప్పటి నుంచి కోట్లాది రూపాయలు కుక్కల స్టెరిలైజేషన్ కోసం ఖర్చు చేశారని చెప్పారు. ఈ నిధులన్నీ పక్క దారి పట్టాయని.. ఇప్పటి వరకు స్టెరిలైజేషన్ కారణంగా ఎలాంటి మార్పు లేదని వేణుమాధవ్ కోర్టుకు తెలిపారు.

2022 ఏప్రిల్‌లో కూడా ఒక రెండేళ్ల చిన్నారిని వీధి కుక్కలు ఇలాగే చంపేసిన ఘటనను ఆయన కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. జీహెచ్ఎంసీ స్టెరిలైజేషన్‌ను సక్రమంగా అమలు చేసి ఉంటే ఇలాంటి ఘటనలు అసలు జరిగేవి కావని ఆయన అన్నారు. కాగా, జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న స్ట్రే డాగ్ షెల్టర్లను పరిశీలించి జూన్ 8లోగా నివేదిక అందించాలని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటీని హైకోర్టు ఆదేశించి.. విచారణ వాయిదా వేసింది.

First Published:  17 March 2023 9:27 AM IST
Next Story