హైడ్రాను భూతంగా చూపకండి
పేదల పట్ల ఒకలా, పెద్దోళ్ల పట్ల మరోలా హైడ్రా వ్యవహరించదన్న కమిషనర్ రంగనాథ్
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉన్నదని కమిషనర్ రంగనాథ్ అన్నారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రాను ఏర్పాటు చేసి రెండు నెలలు అయ్యింది. పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం మన హక్కు అన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత అన్నారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో కొందరు బడా వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశాం. కానీ దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదన్నారు. అమీన్‌పూర్లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతమయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియానే హైడ్రాను ఎక్కువగా ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైడ్రాను బూచిగా చూపించి ప్రజలను భయపెడితే భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుంది. చెరువులు, ప్రభుత్వ భూములను ఎవరూ కాపాడలేరు. జన్వాడ ఫామ్ హౌస్ 11 జీవో పరిధిలో ఉన్నది. 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదని రంగనాథ్ వివరించారు.
కొందరు అక్రమంగా బిజినెస్ లు చేస్తూ... హైడ్రా వచ్చినప్పుడు కిరోసిన్, పెట్రోల్ తో ఆందోళన చేస్తున్నారు. కూకట్ పల్లి చెరువు దగ్గర ఉన్నవారికి ముందస్తు సమాచారం ఇచ్చాం. కొందరు సీరియస్ తీసుకోలేదు. అయినా వారిని ఖాళీ చేయించిన తరువాతనే కూల్చివేతలు ప్రారంభించాం. హైడ్రా అనేది ఒక బూచిగా చూపించి బుచ్చమ్మను భయబ్రాంతులకు గురిచేశారు. పేద వాళ్ళను ఇబ్బందులు గురిచేయడానికి హైడ్రా ఉండదని అది ఓ భరోసా అన్నారు. కొన్ని కట్టడాలను కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తున్నదని కితాబు ఇచ్చారని రంగనాథ్ చెప్పారు. మల్లారెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒవైసీ కాలేజీలు బఫర్ జోన్ లో ఉన్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయి. పిల్లల అకడమిక్ సంవత్సరం నష్టం జరుగుతుందని ఆలోచన చేస్తున్నామన్నారు. పేదల పట్ల ఒకలా, పెద్దోళ్ల పట్ల మరోలా హైడ్రా వ్యవహరించదు. అక్రమంగా నిర్మించిన పెద్ద వాళ్ళే ప్రథమ టార్గెట్ గా హైడ్రా కూల్చివేస్తుందన్నారు.